అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. నగరంలో రెండున్నరేళ్లుగా దోపిడీ పాలన కొనసాగుతోందని, సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలన్నా కూటమి నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. రుద్రంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మంత్రి బంధువు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం పరిస్థితికి నిదర్శనమని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. జిల్లాలో మట్టి, ఇసుక దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామని, రుద్రంపేట పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లలేకపోయామని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్న పనులకు సైతం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు గౌరవం, భద్రతకు ప్రాధాన్యం పార్టీ కార్యకర్తలకు గౌరవం పెరిగేలా ఐడీ కార్డులు అందిస్తున్నామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు కార్యకర్త ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, వైయస్ జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలు, యువతను మోసం చేసిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.