ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ 

 తాడేపల్లి :   రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పారదర్శకమైన వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు పలు సందర్భాల్లో నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్‌ నిర్వహణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ఎవరు ఏ అభ్యంతరాలు వ్యక్తం చేశారు? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, పునరుద్ధరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది? అనే అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాకుండా.. పారదర్శకంగా వ్యవహరించారనే నమ్మకం కూడా ప్రజల్లో కలగాలని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన 2023 చట్టాన్ని  మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల కమిషనర్ల నియామకానికి  ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసేలా చట్టంలో మళ్లీ సవరణ తీసుకురావాలని వైయ‌స్‌ జగన్‌ సూచించారు. నియామక ప్రక్రియలో తటస్థత ఉంటే ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన  ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) సందర్భంగా అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, వైయ‌స్ఆర్‌సీపీ చేసిన పలు అభ్యంతరాలు, విజ్ఞప్తులు పట్టించుకోలేదని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలోనూ డివిజన్ల పునర్విభజన తీరుపై ప్రతిపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కన పెట్టారని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్థ ఎలా పనిచేస్తుందో నిర్ణయించే ప్రధాన ప్రమాణాలు పారదర్శకత, జవాబుదారీతనం  అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడుతూ, ప్రతి పౌరుడు ఎలాంటి భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను బలోపేతం చేయడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతగా ఉండాలని స్పష్టం చేశారు.
 

Back to Top