డీఎస్సీ నిరసనలపై అక్రమ అరెస్టులా?

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు

 ఎన్టీఆర్‌ జిల్లా: డీఎస్సీ నిరసనల్లో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అక్రమ కేసులతో అరెస్ట్‌ చేసి వేధించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు అన్నారు. అక్రమంగా అరెస్టైన పార్టీ నేతలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హోంమంత్రి అనితను సూటిగా ప్రశ్నించారు. రాజకీయ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో నమోదైన కేసులను చూపించి వైయ‌స్ఆర్‌సీపీ నేతలను రౌడీషీటర్లుగా ఎలా చిత్రీకరిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, రాజకీయ కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను ఉపయోగించకూడదని అన్నారు.

చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌పై కేసులు లేవా? నందిగామ ఎమ్మెల్యే తంగిరా సౌమ్యపై కేసులు లేవా? అని మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. వారిపై కేసులు ఉంటే వారిని కూడా రౌడీషీటర్లుగా పరిగణిస్తారా అని హోంమంత్రిని నిలదీశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై నమోదైన కేసులన్నీ రాజకీయ నిరసన కార్యక్రమాలకు సంబంధించినవేనని తెలిపారు. డీఎస్సీ నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు, అరెస్టులతో భయపెట్టకుండా వారి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.
 

Back to Top