కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

  కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా

 ఒంగోలు : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు. ఒంగోలు క్లౌపేటలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ దివంగత కాకుమాను రాజశేఖర్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాకుమాను రాజశేఖర్‌ మృతిపై వైఎస్‌ జగన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో కాకుమాను రాజశేఖర్‌ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన మృతి వైయ‌స్ఆర్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు.

రాజశేఖర్‌ కుటుంబం ఒంటరిది కాదని, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Back to Top