కూటమి ఆరాచకాలపై ఈసీ స్పందించదేం..?

పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఒక్క అంశంలోనూ చర్యలు ఎందుకు లేవు

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బీ వై రామయ్య సూటి ప్రశ్నలు

కర్నూలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అధికార ప్రతినిధి బీ వై రామయ్య

ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

అధికార పార్టీ ఆగడాలకు కొమ్ముకాసే రీతీలో కమిషనర్ వ్యవహారం

అధికార ప్రతినిధి బీ వై రామయ్య మండిపాటు

ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించే దమ్ము చంద్రబాబుకు లేదు

రౌడీయిజంతో స్థానిక ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు

ఎన్ని దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు సాగించినా వైఎస్సార్ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గవు

పార్టీ అధికార ప్రతినిధి బీ వై రామయ్య స్పష్టీకరణ

కర్నూలు: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హింస, దాడులు, దౌర్జన్యాలు వంటి  వ్యవహారాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ పక్కా ఆధారాలతో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈసీ సక్రమంగా స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బీ వై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈసీ దృష్టికి తీసుకెళ్లిన ఘటనలపై ఇప్పటివరకు ఒక్క అంశంలో కూడా తగు చర్యలు కనిపించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, కూటమి అరాచకాలకు కొమ్మకాసే రీతిలో పని చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కర్నూలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ,  ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించే దమ్ము, ధైర్యం లేనందునే చంద్రబాబు రౌడీయిజంతో ఎన్నికలు జరుపుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బీ వై రామయ్య ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు, రౌడీలు కాపలా కాచి దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. వెన్నుపోటు పార్టీ ఎన్ని బెదిరింపులు, దాడులు జరిపినా సరే  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గబోరని బీ వై రామయ్య స్పష్టం చేశారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తుందని, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడుకునేందుకు అన్ని చట్టబద్ధ మార్గాలను ఆశ్రయిస్తామనన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు దిగుతున్న చంద్రబాబుకు,  ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబుకు నిజంగా తాను సాగిస్తున్న పాలన మీద నమ్మకం ఉంటే ప్రజల తీర్పును స్వేచ్ఛగా వెలువరించేలా ఎన్నికలు జరపాలని,  నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రతి దశ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకునే సాగుతున్న నిరంకుశ పాలనను  వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని  బీవై రామయ్య స్పష్టం చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే...

ఓటమి భయంతో.. గెలిచే ధైర్యం లేకే..

దేశంలోనే తానో  సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు.  కూటమిలో మూడు పార్టీలు ఉన్నా, ముప్పై పార్టీలు కలిసివచ్చినా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేక, అధికార బలంతో  అడ్డదారుల్లో గెలిచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
గత రెండున్నరేళ్లలో ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఉందని చంద్రబాబు గ్రహించారు.  అందుకే ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక దౌర్జన్యాలకు దిగుతున్నారు. నిజంగా ప్రజల మద్దతు ఉందనే నమ్మకం ఉంటే అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది..?  పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.   కడప, పుంగనూరు, రాయచోటి, పులివెందుల, తిరుపతి తదితర ప్రాంతాల్లో  దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల లాక్కోవడం వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. రాయచోటిలో కార్యాలయాలపై దాడులు, వాహనాలకు నిప్పంటించిన ఘటనలతో అల్లర్లు చెలరేగించి ప్రశాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.  పోలీసులే వాహనాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో పాటు, ఆయుధాల వినియోగంపై  ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

ప్రజాప్రతినిధులకు రక్షణ  కల్పించకపోతే పోలీసు వ్యవస్థ ఎందుకు..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచే నమ్మకం కూటమి ప్రభుత్వానికి లేదు.  అందుకే అధికారాన్ని అడ్డుపెట్టుకుని నామినేషన్  కేంద్రాల గేట్ల వద్ద వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించనీయకుండా  టీడీపీ కార్యకర్తలు, రౌడీలు కాపలా కాస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం, పత్రాలను లాక్కోవడం వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం..? ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు.   ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం, ఎంపీలు అవినాశ్ రెడ్డి, గురుమూర్తిలపై దాడులకు దిగేలా కూటమి మూకలు బరితెగించి వ్యవహరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.  ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు చట్టబద్ధమైన అర్హతలు ఉన్నప్పుడు, అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ హక్కులకు విఘాతం కలిగించడం తగదు అని వైెఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బీ వై రామయ్య హితవు పలికారు.

Back to Top