అనంతపురం జిల్లా: గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుత్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు సమాచారం అందడంతో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఇన్చార్జి వై. వెంకటరామిరెడ్డి స్పందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులకు అండగా నిలిచి నామినేషన్లు వేయించేందుకు గుత్తికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని రాజపురం గ్రామం వద్ద పోలీసులు వై. వెంకటరామిరెడ్డితో పాటు వైయస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుని గుత్తి వైపు వెళ్లకుండా నిలిపివేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, నామినేషన్లు దాఖలు చేయడం ప్రతి అభ్యర్థికి ఉన్న హక్కు అని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. అభ్యర్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.