నామినేషన్ల గడువు ముగిసేవరకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు!

దాచేపల్లి పోలీసుల తీరుపై అభ్యంతరాలు

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. నామినేషన్ల గడువు ముగిసే వరకు అడ్డంకులు కొనసాగించడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరుతున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌కు నామినేషన్ దాఖలు చేసేందుకు గురజాల అదనపు సివిల్ జడ్జి కోర్టు అవకాశం కల్పించింది. ఆయన ఇంట్లో మద్యం బాటిళ్లు ఉన్నాయనే కేసులో పోలీసులు అరెస్టు చేసి గురజాల జైలుకు తరలించడంతో, నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, రవికుమార్‌ నామినేషన్ దాఖలు చేసేందుకు పోలీసు రక్షణ కల్పించాలని దాచేపల్లి పోలీసులను ఆదేశించింది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నామినేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించాలని సూచించింది. నామినేషన్ సమయంలో ఆయనను బెదిరించకూడదని, థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ పరిణామంతో నామినేషన్ దాఖలుకు రవికుమార్‌కు అవకాశం లభించింది.

Back to Top