తాడేపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర అధికార దుర్వినియోగానికి, రాక్షస పాలనకు నిదర్శనంగా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేక, ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదన్న భయంతోనే ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా పోలీసుల అండతో భౌతిక దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. పులివెందుల వంటి చోట్ల పోలీసులే నేరుగా కార్లపై దాడులు చేయడం అధికార పక్ష కిరాయి సైన్యంలాంటి తీరుకు అద్దం పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిగా నిష్క్రియాపరంగా మారిపోయిందని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, తమ పాలనపై ధైర్యం ఉంటే ప్రతిపక్ష అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్లు వేయనిచ్చి, ఎన్నికల బరిలో ప్రజా తీర్పును ఆహ్వానించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ఇది ఎన్నికల ప్రక్రియ కాదు.. పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్! రాష్ట్రంలో జరుగుతున్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతమాత్రం కాదు. ఇది ముందస్తు ప్రణాళికతో చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నారు. 15 లక్షల మంది మృతుల ఓట్లతో పాటు మరో 29 లక్షల బోగస్, డూప్లికేట్ ఓట్లు.. ఇలా మొత్తం 44 లక్షల అనుమానాస్పద ఓట్లు జాబితాలో ఉన్నాయి. దగ్గరలోనే ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో, దాన్ని పూర్తికాకముందే ఇంత హడావుడిగా లేని ఓట్లతో ఎన్నికలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? కేవలం 12 రోజుల్లోనే మొత్తం తంతు ముగించేలా కుట్ర పన్నారు. చిట్టచివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించి, ఎవరూ సిద్ధం కాకుండా చేశారు. అధికారంలో ఉన్న అడ్వాంటేజ్‌తో ప్రతిపక్షానికి అసలు అవకాశమే లేకుండా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రోజుకు 4 గంటలే సమయం.. సీసీ కెమెరాలు లేని చోట్ల కేంద్రాలు! దేశంలో ఎక్కడా లేని విధంగా నామినేషన్లకు రోజుకు కేవలం నాలుగు గంటలు (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) మాత్రమే సమయం ఇచ్చారు. ఆ నాలుగు గంటల్లో కూడా వైయస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే భౌతికంగా అడ్డుకుంటున్నారు. నామినేషన్ కేంద్రాలను ప్రధాన కార్యాలయాల్లో కాకుండా, సీసీ కెమెరాలు కూడా లేని సందుగొందుల్లోని చిన్న పాఠశాలల్లో పెట్టారు. అక్కడ టీడీపీ గూండాలు వందల సంఖ్యలో తిష్టవేసి ఉంటే పోలీసులు వారికి రక్షణగా నిలుస్తున్నారు. వైయస్సార్సీపీ అభ్యర్థులు పత్రాలు పట్టుకుని వెళ్తే పోలీసులే బలవంతంగా బయటకు నెట్టేస్తున్నారు. పులివెందులలో పోలీసులే గూండాల్లా దాడి చేశారు! పులివెందులలో జరిగిన దారుణాన్ని ప్రజలందరూ చూశారు. పోలీసులు చెప్పిన సమయానికే ఎంపీ అవినాష్ రెడ్డి వెంట అభ్యర్థులు వెళ్లినా.. వారికి రక్షణ కల్పించాల్సింది పోయి పోలీసులే నేరుగా కార్లపై విరుచుకుపడ్డారు. అక్కడ ఏ గొడవా జరగకపోయినా, ఎవరూ బెదిరించకపోయినా.. కిరాయి సైన్యంలా చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులే కార్లను పగలగొట్టడం, దాడులకు దిగడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనం. పోలీసులు కాకీ చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకుంటే బాగుంటుంది. ఇక బద్వేలులో అధికారులు చూస్తుండగానే టీడీపీ మూకలు లోపలికి చొరబడి మా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కట్టలతో సహా లాక్కెళ్లారు. ఎంపీలపైనే దాడులు.. పత్రాలు చించేసిన పచ్చ మూకలు! పుంగనూరులో లోక్‌సభలో వైయస్సార్సీపీ పక్ష నేత మిథున్‌రెడ్డిపై రాళ్లదాడి చేశారు. నాలుగు గంటలపాటు మా అభ్యర్థులు లోపల నిలబడి ఎదురుచూసినా అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఫోన్ చేయించినా ఆర్వోలు పత్రాలు తీసుకోకుండా మొహం చాటేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వెంట వచ్చిన అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. మధ్యాహ్నం రమ్మని చెప్పి, తీరా వెళ్లాక గేట్లు మూసేసి సమయం అయిపోయిందని వెనక్కి పంపించారు. రాయచోటిలో ఏకంగా మా పార్టీ కార్యాలయంపైనే పచ్చ గూండాలు పడి విధ్వంసం సృష్టించారు. గురజాల నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఈసీ పూర్తిగా డమ్మీ.. పోలీసుల చేతుల్లోనే సర్వాధికారాలు! రాష్ట్రంలో ఎన్నికల సంఘం పూర్తిగా డమ్మీగా మారిపోయింది. పోలీసులే సర్వాధికారులుగా చెలరేగిపోతున్నారు. మేము వెళ్లి ఎస్ఈసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే.. వారు దాన్ని డీజీపీకి పంపిస్తున్నారు. ఆ డీజీపీ వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులే అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి నిధులు రావనే భయంతోనే ఈ ఎన్నికలను తూతూమంత్రంగా లాగించేయాలని చూస్తున్నారు. తానే ఆటగాడు, తానే రిఫరీ, తానే విజేతగా ప్రకటించుకోవడానికి ఈ ఎన్నికల డ్రామా ఎందుకు? నేరుగా రాష్ట్రపతి పాలన లాంటిది ఏదో పెట్టుకోవచ్చు కదా! పక్క రాష్ట్రాల రౌడీలంటూ తప్పుడు ప్రచారం.. ఆధారాలు చూపించగలరా? పక్క రాష్ట్రాల నుంచి రౌడీలు వచ్చారంటూ టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా రౌడీలు వస్తే పోలీసుల చేతులు కట్టేశారా? వారిని అరెస్ట్ చేయవచ్చు కదా? పుంగనూరులో మిథున్ రెడ్డి కార్లను తగలబెట్టి, తిరిగి ఆయనే కార్లను తగలబెట్టుకున్నాడని రివర్స్ కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఎదుటివారిపై దాడులు చేయడం, తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించడం అధికార పార్టీకి అలవాటుగా మారింది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసు వ్యవస్థను ఒక మాఫియాలా మార్చేశారు. చట్టాన్ని అతిక్రమించి కిరాయి సైనికుల్లా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరునూ డైరీలో రాసిపెట్టుకుంటున్నాం, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దమ్ముంటే స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వండి: చంద్రబాబుకు సవాల్! అసలు ఒక వార్డు సభ్యుడిగా వైయస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేస్తే చంద్రబాబుకు ఎందుకంత వణుకు? అని సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ రెండేళ్ల కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ అని తేలిపోతుందని, ప్రజలు తిరస్కరిస్తారని భయపడుతున్నారా? అని నిలదీశారు. కూటమి పాలన బ్రహ్మాండంగా ఉందని నమ్మకం ఉంటే.. వైయస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేసి, ప్రచారం చేసుకోనివ్వాలని... పోలింగ్ బూత్‌లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తేల్చుకుందామని సవాల్ చేశారు. మరోవైపు రేపు కూడా నామినేషన్లకు గడువు ఉన్న నేపధ్యంలో... అభ్యర్థులందరూ నిర్భయంగా నామినేషన్లు వేయవచ్చని డీజీపీతో బహిరంగ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా వైయస్సార్సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని. వైయస్ జగన్ నాయకత్వంలో ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకునే ధైర్యం మాకుందని స్పష్టం చేశారు. వైయస్సార్సీపీకి ప్రజలే రక్షణ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.