రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రెస్టీజ్ పేరుతో ఎన్నికల ముసుగులో అరాచకాలు చేస్తున్నాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాపారుల దుకాణాలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ కార్యాలయం, వాహనాలపై దాడులకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మండిపడ్డారు. రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయం, వాహనాలపై దాడులు, వ్యాపారుల ఆస్తుల విధ్వంసానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా చట్టం ప్రకారం నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. "నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించాలి. దాడులు, బెదిరింపులు పక్కనపెట్టి ప్రజల ముందుకు రండి. మీ పాలనపై ప్రజలే తీర్పు చెప్పేలా స్వేచ్ఛాయుత ఎన్నికలకు సిద్ధపడాలి. నేను ప్రచారానికి రాను, మీరు ప్రచారానికి రాకండి.. పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగనివ్వండి. వైఎస్సార్సీపీ తరఫున 44 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేయించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుని స్వేచ్ఛగా ఓటు వేస్తే ఎవరి బలం ఎంతో తేలిపోతుంది. ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం మంత్రికి ఉందా?" అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేకనే..: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించిన జిన్నా షరీఫ్ ఒక వ్యాపారవేత్త. పార్టీపై అభిమానంతో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన వ్యాపారాలను అడ్డుకుంటూ, దుకాణాలపై దాడులు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తారని నమ్మకం లేక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే దానిని హత్య కుట్రగా చిత్రీకరించి వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. నిజంగా కుట్ర జరిగిందని భావిస్తే ఆధారాలతో విచారణ కోరండి. ఆధారాలు లేకుండా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లను ఇందులోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం హేయం. రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తిరిగి తీసుకురండి: ఎన్నికల సమయంలో రాజకీయ ఆరోపణలు చేయడం కాదు, రాయచోటి ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పండి. రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తిరిగి తీసుకురావాలని ప్రజలు కోరుతుంటే దానిపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు? మంత్రి హోదాలో మీకు నిజంగా పలుకుబడి ఉంటే జిల్లా కేంద్రాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేయండి. స్టేడియాలు, రింగ్‌రోడ్లు, జిల్లా అభివృద్ధి వంటి అంశాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిపై చర్చించకుండా దాడులు, బెదిరింపులు, వ్యక్తిగత ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించడం మానుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి మీ పాలనపై నమ్మకం కల్పించాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.