రెండో రోజూ వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై విచ్చలవిడిగా దాడులు

అయినా చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు, ఇతర అధికారులు 

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మరోసారి వైఎస్సార్సీపీ ఫిర్యాదు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్బంగా వరుసగా రెండో రోజూ వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై జరుగుతున్న దాడులు, నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్న తీరుపై మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసిన పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు యనమల నాగార్జున యాదవ్, అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు. అనంతరం మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు..

టీడీపీ దాడుల్ని అడ్డుకోవడంలో వ్యవస్థలన్నీ విఫలం

పోలీసుల అండతో విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు

ఎంపీలపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర

ఇప్పటికైనా స్పందించాలని ఎస్ఈసీని కోరాం

లేళ్ల అప్పిరెడ్డి వెల్లడి

ఎస్ఈసీకి వరుస ఫిర్యాదులు చేస్తున్నా స్పందన లేదు

వరుస ఘటనలపై ఇవాళ కూడా ఆధారాలతో ఫిర్యాదు చేశాం

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిపించాల్సిన బాధ్యత లేదా?

ఎన్నికల కమిషన్ పైనా పోరాటాలు చేసే పరిస్ధితి తీసుకు రావద్దు

లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరిక

పచ్చ చొక్కాల కోసమే పనిచేస్తున్న పోలీసులు

ఏపీని జంగిల్ రాజ్ గా మార్చేసిన చంద్రబాబు

దమ్ముంటే మమ్మల్ని పోటీచేయనిచ్చి గెలవాలి

అధికారం అడ్డుపెట్టుకుని గెలవానుకోవడం పిరికితనం

టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ 

విజయవాడ:     రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా తమ అభ్యర్ధుల్ని అడ్డుకోవడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్లడం, నేతల నిర్బంధాలు వరుసగా రెండోరోజూ కొనసాగడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా పార్టీ లోక్ సభ ఎంపీలను సైతం లెక్కచేయకుండా టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగుతున్న వ్యవహారంపైనా ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కి మరోసారి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న చేసిన ఫిర్యాదులపై ఎస్ఈసీ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లే ఇవాళ కూడా దాడులు కొనసాగిన విషయాన్ని పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు గుర్తుచేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఢప్తి చేశారు. 
ప్రెస్‌ మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

ఎస్ఈసీ నిర్లిప్తత వల్లే రెండోరోజూ దాడుల పర్వం
: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ 

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులైంది. నిన్న పుంగనూరు, రాయచోటితో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు.  పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద జరిగిన దాడి, రాజంపేటలో నామినేషన్లు లాక్కున్న వైనంపైనా, రాయచోటిలో పార్టీ ఆఫీసు, పార్టీ నేతల వాహనాలు తగులబెట్టిన ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో ఘోరంగా విఫలమవుతున్న వ్యవహారంపై నిష్పక్షపాతమైన విచారణ జరగాలి, ఈ ఘటనలకు కారణమైన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. చేష్టలుడిగి చూస్తున్న పోలీసు అధికారులు, వారికి సహకరించిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరాం. కానీ ఏమార్పూ లేని పరిస్ధితులు ఉన్నాయి. నిన్నటి ఘటనల కంటే ఎక్కువగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ అభ్యర్ధుల చేతుల్లో నామినేషన్ పత్రాలు లాక్కెళ్తున్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి నామినేషన్ ప్రతిపాదనల్ని తీసుకెళ్తున్న స్థానిక ఎంపీ గురుమూర్తిని పోలీసులు అడ్డుకోవడం, పేపర్లు చూపించమని అడగటం, అక్కడే ఉన్న టీడీపీ గూండాలు వీళ్ల చేతుల్లో నామినేషన్లు లాక్కెళ్లిన పరిస్ధితులు చూస్తుంటే ప్రజాస్వామ్యమా నీ అడ్రస్ ఎక్కడుందని ప్రశ్నించాల్సి వస్తోంది. 
    కడపలో అభ్యర్ధుల్ని నామినేషన్ వేయనివ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డిని, కమలాపురం ఇన్ ఛార్జ్ నరేన్ ను అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పారు. కడప టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి విలేఖరుల సమావేశం పెట్టి ఏ నాకొడుకు నామినేషన్లు వేస్తారో రండి అంటూ సవాళ్లు విసురుతుంటే పోలీసులు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు స్పందించడం లేదు. మాజీ కార్పోరేటర్ కుమారుడిని కత్తులతో పొడిస్తే పేగులు బయటికి వచ్చి ఆస్పత్రిలో చేరారు. పులివెందులలో ఇవాళ ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీ నామినేషన్ వేయడానికి అభ్యర్ధులు బయలుదేరితే పోలీసులు అధికారులు ఒకటిన్నర తర్వాత రమ్మని సమాచారం ఇచ్చారు. ఒకటిన్నర తర్వాత నామినేషన్ వేయడానికి అభ్యర్ధులు, అవినాష్ రెడ్డి వెళ్తే పోలీసులే అడ్డుకుని గాల్లో కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. నామినేషన్ వేసే సమయం 3 గంటల వరకే ఉండటంతో వేయకుండా అడ్డుకున్నారు. 
    తాడిపత్రి, ధర్మవరంలోనూ ఇలాంటి ఘటనలే. ప్రశాంతమైన దర్శి నియోజకవర్గంలో సైతం నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెళ్తుంటే అడ్డుకుని లాఠీచార్జ్ లు చేశారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో నామినేషన్లు వేయడానికి వెళ్తే అదుపులోకి తీసుకుని బస్సుల్లో ఎక్కడెక్కడికో తిప్పుతున్నారు. 

వ్యవస్ధలన్నీ ఏకమై వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఆటంకాలు

పోలీసుల సాయంతో బలవంతంగా అడ్డుకుని వైఎస్సార్సీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయనీయకుండా వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా స్థానిక ఎన్నికల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందని మరోసారి గుర్తుచేసాం. నిర్వీర్యమైన వ్యవస్థల్ని సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఎస్ఈసీ పై మేం పోరాటం చేయాలా అని అడుగుతున్నాం. మెట్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, ఫిర్యాదులు చేస్తున్నాం. అయినా ఎక్కడా చర్యలు తీసుకున్న పరిస్ధితి కనిపించడం లేదు. స్వాతంత్రం తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ ఎక్కడా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్ధితులు మాత్రం లేవు.  వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం కుప్పంలో మీరు నామినేషన్లు వేసుకోనివ్వలేదా, ఎన్నికల్లో మీ అభ్యర్ధులు పోటీ చేయలేదా, గెలవలేదా ? కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మాత్రం విపక్షాల్ని అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో సక్రమంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్న భయం వారిలో కనిపిస్తోంది. ఎస్ఈసీ మాత్రం ఇవన్నీ చేష్టలుడిగి చూస్తోంది. 
    ఎస్ఈసీ స్పందించకపోతే మేం ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలో అర్దం కావడం లేదు. మేం ఎలాంటి పోరాటం చేయాలో ఆలోచించుకోవాల్సిన పరిస్ధితులు ఉత్పన్నమవుతున్నాయి. మాకు ఎస్ఈసీ అంటే గౌరవం ఉంది. కాబట్టి దయచేసి ఎస్ఈసీపై పోరాటాలు చేయాల్సిన పరిస్ధితులు తీసుకురావొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఇవాళ కోరాం. రాయచోటి, పుంగనూరు ఘటనలపై ఇప్పటివరకూ పోలీసులపై కానీ, ఇతర అధికారులపై కానీ ఏ ఒక్క చర్యా తీసుకోలేదు. నామినేషన్లు తీసుకోని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.  తప్పు చేసిన వారిని శిక్షించకపోతే వ్యవస్థలు ఎలా బాగుపడతాయి, చట్టాన్ని ఎలా కాపాడతారు, ప్రజాస్వామ్యాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నాం. నిన్న టీడీపీకి సహకరించిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వీడియో, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలతో సహా కోరాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అలా జరగని పక్షంలో రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ తగిన కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది. 

ఎన్నికల కమిషన్ కు అసలు జీవం ఉందా ?
: టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే

- ఎన్నికల కమిషన్ కు జీవం ఉందా, మనసు ఉందా, మానవత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాయికృష్ణ కేసులో పోలీసుల తీరు మీద హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇందుకు సిగ్గుపడాలి. పచ్చ చొక్కాలు వేసుకోకపోయినా వాళ్ల కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఎక్కడా దేశంలో ఇలాంటి పరిస్దితులు లేవు. నిన్న ఓ ఎంపీగా మిథున్ రెడ్డి నామినేషన్ కు వెళ్తుంటే ఆయనపై దాడి చేశారు. ఇవాళ తిరుపతిలో ఎస్సీ ఎంపీ గురుమూర్తి రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్తుంటే అనుమతించాల్సింది పోలీసులు తప్ప టీడీపీ కార్యకర్తలు కాదు. చంద్రబాబు ఏపీని జంగిల్ రాజ్ గా మార్చాడు. మీరు ఎంత భయపెట్టాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రవ్వంత కూడా తొణికేది లేదు, బెణికేది లేదు. ఎన్నికల హామీలని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. దాడులతో ఎన్నికల్ని గెలవాలని చూస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే మా అభ్యర్ధుల్ని నామినేషన్లు వేసేలా అనుమతించి, పోటీ పడి గెలవాలి. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించి పారిపోయిన చరిత్ర మీది. కానీ ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ అభ్యర్ధులు, నాయకులపై దాడులు చేసి గెలవాలని చూడటం పిరికితనం.  టీడీపీ శ్రేణుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని పెట్టి బెదిరింపులు, దాడులకు దిగుతున్నా వైఎస్సార్సీపీ అభ్యర్ధులు మాత్రం రేపు కచ్చితంగా నామినేషన్లు వేస్తారు, ఎన్నికల్లో పోరాడి గెలుస్తారు. మీతో వైఎస్సార్సీపీ చేస్తున్న యుద్దం కొనసాగుతూనే ఉంటుంది. 700 రోజుల తర్వాత  జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా రాజ్యం వస్తుంది, అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు పార్టీ నేతలు బదులిస్తూ..

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్ధులతో కలిసి నామినేషన్ల కోసం వస్తుంటే, ఆయనపై దాడి చేసిన వ్యవహారం కళ్లెదుటే కనిపిస్తుంటే.. వారే దౌర్జన్యాలు చేశారని డీఐజీ స్ధాయిలో ఉన్న అధికారి కోయ ప్రవీణ్ ఓ పార్టీకి కొమ్ముకాసేలా ఎలా మాట్లాడతారు? తన పరిధిలో జరిగిన ఘటనలకు సంబంధించిన బాధ్యత కోయ ప్రవీణ్ దే. ముందుగా ఆయనపైనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విధుల నుంచి ఆయన్ను తక్షణం తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. తాజా ఘటనల నేపథ్యంలో నామినేషన్ల గడువు మరో రోజు పొడిగించాలని ఎన్నికల కమిషన్ ను అడిగాం. 27 నెలల్లో చేసిన మంచి ఏమైనా ఉంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోవాలి. అంతే కానీ ప్రత్యర్దుల్ని బెదిరించి ఎన్నికల్ని గెలవాలని ప్రయత్నించకండి. నిన్న రాయలసీమలో జరిగిన ఘటనలపై ఎస్ఈసీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ అది కాస్తా దర్శి వరకూ వచ్చింది. ఇప్పటికైనా అడ్డుకోకపోతే ఇది మిగిలిన ప్రాంతాలకూ విస్తరించడం ఖాయం.

Back to Top