తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వీ.ఎస్. నాగిరెడ్డి పేర్కొన్నారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 27 వరకు రాష్ట్రంలో 32.92 శాతం వర్షపాతం లోటు నమోదైందని, రాయలసీమలో 45.10 శాతం, కోస్తాంధ్రలో 21.64 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 వరకు రాష్ట్ర వర్షపాతం లోటు 55.45 శాతంగా ఉందని, ఉత్తరాంధ్రలో ఇటీవల కురిసిన అధిక వర్షాలకు వరి, వేరుశనగ, అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే సెప్టెంబర్ 23 నాటికి 83 శాతం మాత్రమే సాగు జరిగిందని, వర్షాధారంగా సాగు చేసిన వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నాగిరెడ్డి తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జూన్‌లో కురిసిన వర్షాలతో సాగు ప్రారంభమైనప్పటికీ జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనకాపల్లి, పల్నాడు తదితర జిల్లాల్లో సాధారణ సాగుతో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఎకరాకు రూ.25 వేల కరువు పరిహారం ఇవ్వాలి వర్షాభావంతో పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, సాగు చేయలేని రైతులకు ఎకరాకు రూ.15 వేల ప్రత్యేక కరువు పరిహారం ప్రకటించాలని నాగిరెడ్డి కోరారు. పండ్ల తోటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని 80 శాతం సబ్సిడీతో అందించాలని, దెబ్బతిన్న ప్రాంతాల్లో 75 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని సూచించారు. పశువులకు ఉచిత పశుగ్రాసం, గ్రామాలకు తాగునీరు అందించాలని, వలసలను నివారించేందుకు అక్టోబర్ 1 నుంచి 150 రోజుల కరువు పనులు కల్పించాలని కోరారు. ఉత్తరాంధ్రలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను వెంటనే ఎన్యుమరేషన్ చేసి పరిహారం అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీ, అన్నదాతా సుఖీభవ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రయోజనాలు అందించాలని, సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా అత్యవసర సాగునీటి ప్రణాళిక అమలు చేయాలని కోరారు. రైతు ఆదాయం పడిపోతుంటే ప్రత్యక్ష ఆర్థిక సాయం అవసరం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, డీజిల్, సాగునీటి ఖర్చులు పెరుగుతున్న సమయంలో వర్షాభావం, తక్కువ దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతును ఆదుకుంటేనే వ్యవసాయం నిలుస్తుందని, వ్యవసాయం నిలిస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. ప్రచారాలు, ప్రకటనలకు పరిమితం కాకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయం చేరేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.