స్థానిక ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి

జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంకటరామిరెడ్డి

 అనంతపురం:  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం నగరంలో రూ.1,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని, ప్రతి పంచాయతీ, ప్రతి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ వివరించి పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని సూచించారు. అందరి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఈసారి యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు.

అనంతపురం కార్పొరేషన్‌లోని 62 డివిజన్లతో పాటు మేయర్‌ స్థానాన్ని లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణకు రూ.300 కోట్లు కేటాయించి సర్జికల్‌ బ్లాక్‌ నిర్మాణం చేపట్టామని, ఎంసీహెచ్‌ బ్లాక్‌ కోసం స్థలం ఎంపిక చేశామని తెలిపారు. గుత్తి రోడ్డు నుంచి తడకలేరు వరకు, పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్‌లో వారికి ప్రాధాన్యం కల్పిస్తామని, కార్యకర్తలంతా ఐకమత్యంగా ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అందరి సూచనలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని, గతంలో అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
 

Back to Top