గుంటూరు: డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేడమే కుకుండా తమపై రౌడీషీట్లు తెరుస్తామంటూ చంద్రబాబు, లోకేశ్ బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని ఆక్షేపించారు. గుంటూరులోని వైెఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీగా జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉంది గుర్తు చేసారు. తమ పార్టీ చెబుతున్న అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకునే ధైర్యం లేక, తిరిగి తమపైనే వేధింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదైనా అంశంపై తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు నిరసన దిగితే వారిని రౌడీలంటారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... టీచర్ల ముసుగులో రాజకీయ ఘర్షణకు ప్రభుత్వమే ప్రేరిపించింది: డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ సీపీ తేదీని, వేదికను ముందస్తుగా ప్రకటించి నిరసన చేపట్టింది. అయితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించడం, గురువులపై దాడులుగా ప్రచారం చేయడం చంద్రబాబు, లోకేశ్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. తాము నిరసన చేపట్టిన సమయంలో ఉపాధ్యాయులను అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో లోకేశ్ సమాధానం చెప్పాాలి. తమ పార్టీ కార్యకర్తల నిరనసన కొనసాగుతుండగా, తమపైనే దాడులు చేసి తిరిగి కేసులు కూడా తమ పార్టీ కార్యకర్తలు, నేతలపైనే నమోదు చేయడం చంద్రబాబు దురాగతానికి పరాకాష్ట. ఉపాధ్యాయుల పేరుతో రాజకీయ ఘర్షణలకు ప్రభుత్వం ప్రేరేపించింది. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయనే నమ్మకాన్ని పునరుద్ధరించాల్సింది పోయి, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరింపులకు దిగడం ప్రజాసామ్యబద్దం కాదు. విజయవాడలోని మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ నాయకులపై పలు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులతోపాటు జక్కంపూడి రాజా, దేవినేని అవినాష్, పేర్ని కృష్ణమూర్తి, నాగార్జున యాదవ్ తదితరులను కేసుల్లో చేర్చారు. ఎఫ్ఐఆర్‌లలో కొందరి పేర్లు పేర్కొని, మరికొందరిని 'ఇతరులు'గా నమోదు చేయడం ద్వారా ఎంతమందినైనా కేసుల్లో చేర్చే అవకాశం కల్పించుకున్నారు. నిరసన సందర్భంగా ఆయుధాలు లేకపోయినా, తీవ్రమైన గాయాలు జరిగినట్లు ఆధారాలు లేకపోయినా హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. కోర్టులో ఈ అంశాలపై ప్రశ్నలు ఎదురుకాగా, సమాధానం చెప్పలేక పోలీసులు బిక్కమొహం వేసారు. కోర్టు మొట్టికాయలు వేసినా సరే కొందరు పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. మంత్రి లోకేశ్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నారు రాజకీయ కేసులతో రౌడీషీట్లు తెరుస్తారా!: రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసి, ఆ కేసుల ఆధారంగానే రౌడీషీట్లు తెరవడం ఎంతవరకు సమంజసం. తనపైనా సుమారు 60 కేసులు ఉన్నాయని చెబుతున్నారు. అలాగని నాపై కూడా రాజకీయ కేసులను ఆధారంగా చేసుకుని తనపై కూడా రౌడీషీట్ తెరుస్తారా ..? పానుగంటి చైతన్య, సందీప్ తదితర నాయకులపై రౌడీషీట్లు తెరవడం చట్టవిరుద్దం . దేవినేని అవినాష్, మల్లాది విష్ణు సహా మరికొందరు నాయకులపైనా ఇదే తరహా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు సరికాదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి అర్ధరాత్రి వేళ కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్న 24 గంటల తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇటీవల 29 మందిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో పోలీసుల తీరుపై న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించి చీవాట్లు పెట్టినా సరే తీరు మార్చుకోవడం లేదు. పోలీసుల చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటాం. తమ పార్టీ నాయకులను అరెస్టు చేయాలనుకుంటే డీజీపీ, పోలీసు కమిషనర్ ముందుగానే జాబితా పంపించాలి 200 మందినో, 300 మందినో అరెస్టు చేయాలనుకుంటే అందరం బస్సుల్లో పోలీసు కమిషనర్ కార్యాలయానికి వస్తాం. ఏం చేస్తారో మేమూ..చూస్తాం. పోలీసు వ్యవస్థలో నిజాయతీగా పనిచేస్తున్న అధికారులు ఎంతోమంది ఉన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరిస్తున్న కొందరి తీరునే తప్పబడుతున్నా. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో న్యాయపోరాటం కొనసాగిస్తాం. ఈడీ నోటీసులే రాలేదు.. విచారణకు ఎందుకు వెళ్తా..?: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసుల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, గతంలో తనకు వాట్సాప్ ద్వారా అందిన నోటీసులో పేర్కొన్న హాజరు తేదీ అప్పటికే ముగిసిపోయిందని అంబటి వివరించారు. సెప్టెంబర్ 25 న హాజరు కావాలంటూ తనకు ఎలాంటి లిఖితపూర్వక నోటీసు అందలేదని చెప్పారు. తాను మతం మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. తాను పుట్టుకతో హిందువునని, మతం మారే ప్రసక్తి లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.