ఖాకీల అండతో కొడుకు లోకేష్ ‘దగా డీఎస్సీ’ పాపాలను కప్పెడుతున్న చంద్రబాబు

సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా మార్పురాని ఏపీ డీజీపీ, విజయవాడ సీపీల వైఖరి.

ప్రభుత్వం, పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) 

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కామ్ పై సీబీఐ దర్యాప్తు కోరితే హత్యాయత్నం కేసులా?

ఏ సెలవు పెట్టి మూకుమ్మడిగా శాప్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు

బడి ఎగ్గొట్టి ధర్నా చేసిన గురువులపై విద్యాశాఖ ఎందుకు చర్యలు తీసుకోదు?:

ఇది సర్వీస్ నిబంధనలకు విరుద్దం కాదా?

సూటిగా ప్రశ్నించిన పేర్ని నాని.  

తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని).

సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు

ఎన్ని నిర్బంధాలు పెట్టినా డీఎస్సీ బాధితుల తరఫున పోరాటం ఆగదు:

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో నారా లోకేష్ నాయకత్వంలో నడిచిన 'దగా డీఎస్సీ' అక్రమాలు, దొడ్డిదారిన చొరబడ్డ దొంగ గురువుల కుంభకోణం నుంచి తన కుమారుడిని రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని అత్యంత నీచమైన, బరితెగించిన రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని నడిబొడ్డున సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పట్టపగలే కొట్టి చంపేసి, శవాన్ని సైతం బూడిద చేసి మాయం చేసిన కిరాతక లాకప్ డెత్ ఘటనపై అత్యున్నత హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కే కళ్లకు గంతలు కట్టేందుకు సాహసించిన డీజీపీ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుల వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ దారుణంపై సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగి కాకిచొక్కా మాటున ఉన్న హంతక పోలీసుల లెక్కలు సరిచేస్తామని మొట్టికాయలు వేసినా, కోర్టులు చీవాట్లు పెట్టినా డీజీపీ, విజయవాడ సీపీల్లో ఏమాత్రం మార్పు రాలేదని, చంద్రబాబు మెహర్బానీ కోసం, రెడ్ బుక్ ఆదేశాల అమలు కోసం రాజ్యాంగాన్ని, కోర్టులను సైతం కాలరాస్తూ బరితెగించి వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికెట్లతో జరిగిన అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ కోరుతూ శాప్ ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు  శాంతియుతంగా వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే లోకేష్ యువగళం గూండాలు, నకిలీ గురువులతో కర్రలతో నెత్తురోడేలా భౌతిక దాడులు చేయించారని పేర్ని నాని మండిపడ్డారు. ఆఖరికి వికలాంగ వ్యక్తి దగ్గర కర్రను లాక్కుని మరీ అతన్నే చావబాదిన దుర్మార్గులను వదిలేసి, బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే రివర్స్‌లో 307 హత్యాయత్నం కేసులు, పార్టీకి చెందిన ఎస్సీ నాయకులపైనే తిరిగి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి పూట మేజిస్ట్రేట్ ముందుకు లాక్కెళ్లిన ఖాకీల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ప్రొబేషన్ పీరియడ్‌లోని ఉపాధ్యాయులు వందల సంఖ్యలో ఏ నిబంధనల ప్రకారం, ఏ సెలవు పెట్టి విజయవాడకు తరలివచ్చారని ఆయన నిలదీశారు. వారికి డీఈవోలు ఎలా అనుమతిచ్చారని, ముఖ్యమంత్రి, మంత్రుల బహిరంగ సభలను తలపించేలా ఐరన్ పెండాల్స్, షామియానాలు, డీజేలు, సౌండ్ సిస్టమ్‌లతో ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణంలోనే రాజకీయ ధర్నాకు ఎవరు అనుమతి ఇచ్చారని ధ్వజమెత్తారు. మొగల్రాజపురంలోని ఏసీ కల్యాణ మండపంలో వారికి బస, విలాసవంతమైన విందు భోజనాలు ఎవరు సమకూర్చారో, వారు శాప్ ఎండీకి ఏమని వినతిపత్రం ఇచ్చారో తక్షణమే ప్రజల ముందుంచాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డీఈవోలు, కమిషనర్ సహా ఉన్నతాధికారులంతా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

లోకేష్ దగా డీఎస్సీ పాపాలు కప్పిపుచ్చేందుకే దాడులు, అక్రమ కేసులు.

దగా డీఎస్సీ ద్వారా దొడ్డిదారిన పాఠశాలల్లోకి దూరిన దొంగ గురువుల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, చంద్రబాబు, లోకేష్ లు ఆ దొంగ గురువుల్ని, యువగళం గూండాల్ని మా కార్యకర్తల మీదికి ఎగదోస్తున్నారు. దొంగ గురువులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, యువగళం గూండాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయిస్తూ తిరిగి మాపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. టెట్, డీఎస్సీ రాయని వాళ్ళు గురువులు ఎలా అవుతారు? ముందు రోజు రాత్రే సంతకాలు తీసుకుని పోలీసులే పిటిషన్లు రాసి, వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ నాయకులపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, 307 హత్యాయత్నం కేసులు పెట్టడం ఎంత నీతిమాలిన చర్య! ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లలో మగ్గదీసినా లోకేష్ చేసిన డీఎస్సీ పాపాలు తేలేవరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పోరాటం ఆగదు.

కృష్ణలంక లాకప్ డెత్.. పోలీసుల బరితెగింపుపై సుప్రీంకోర్టు హెచ్చరిక..

రాజధాని నడిబొడ్డున సాయికృష్ణ అనే కాపు యువకుడిని పట్టపగలు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చంపేసి, శవాన్ని బూడిద చేసి మాయం చేస్తే, రెడ్ బుక్ రాతల ద్వారా వేధింపులకు అలవాటుపడిన డీజీపీ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబులు అత్యున్నత హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కే కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ఐపీఎస్ లు చదువుకుని కూడా రాజ్యాంగ విలువలు లేకుండా ఇంత గుండెలు తీసిన బంట్లుగా ఎలా తయారయ్యారు? ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటే ఎవరినైనా తీసుకెళ్లి చంపేసి బూడిద చేసే అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది? కాకిచొక్కా మాటున దాక్కున్న సాయికృష్ణ హంతకుల లెక్కలన్నీ తేలుస్తామని సుప్రీంకోర్టు స్వయంగా హెచ్చరించిందంటే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. 164 సీట్ల అధికార మదం ఉన్నా, ఎంతటి వారైనా నిజాన్ని తప్పించుకోలేరు.

మున్సిపల్ ఎన్నికల కోసమే 1000 మందిని జైల్లో పెట్టే కుట్ర.

రాబోయే అక్టోబర్ మున్సిపల్ ఎన్నికల కోసమే చంద్రబాబు నాయుడు ఈ తప్పుడు కేసుల కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడకుండా ప్రజల తరపున నిలదీస్తుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో క్రియాశీలకంగా ఉన్న 800 నుంచి 1000 మంది నేతలపై 295, 296 క్రైమ్ నెంబర్లతో అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. నెల రోజుల పాటు బెయిల్ రాకుండా చేసి ఎన్నికలు జరిపించుకోవాలనేది బాబు దుర్బుద్ధి. విజయవాడ కేదారేశ్వరపేటలో అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలైన మాజీ కార్పొరేటర్ మణిమ్మ గారిని సైతం అరెస్ట్ చేయాలని ఇంటెలిజెన్స్ లిస్టులు పంపారంటే ఇంతకంటే దిక్కుమాలిన పాలన మరొకటి ఉంటుందా?

ధర్మం వైపు నిలిచిన న్యాయమూర్తి..

జస్కరణ్ జీత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అరెస్ట్ చేసేటప్పుడు కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలో ఇవ్వకపోతే అది ఆర్టికల్ 22(1) ఉల్లంఘన కింద అక్రమ నిర్బంధం అవుతుందని తేల్చింది. అలాంటి ఉత్తర్వులను తుంగలో తొక్కి అర్ధరాత్రి పూట వైఎస్సార్సీపీ నేతలను మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తే, ధర్మం కోసం నిలబడిన న్యాయమూర్తి ఆ తప్పుడు 307, ఎస్సీ ఎస్టీ కేసులను తునాతునకలు చేశారు. ముద్దాయి అని తెచ్చిన వ్యక్తి వీడియోల్లో ఎక్కడున్నాడో చూపించలేక సీఐ నీళ్లు నమిలితే న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. చంద్రబాబుకు తొత్తులుగా మారిన అధికారుల మాటలు విని కిందస్థాయి ఎస్ఐలు, సీఐలు రేపు కోర్టుల్లో ముద్దాయిలుగా బోనులో నిలబడతారా? మీ ఉద్యోగాలను బలి చేసుకుంటారా?.

ధర్నాకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? విద్యాశాఖ అధికారులకు బాధ్యత లేదా?

పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వందల సంఖ్యలో ఉపాధ్యాయులు బడి ఎగ్గొట్టి  బస్సుల్లో విజయవాడకు ఎలా వచ్చారు? మొగల్రాజపురంలోని అమ్మ కల్యాణ మండపంలో వారికి విడిది ఎవరు ఇచ్చారు? విందు భోజనాలు ఎవరు పెట్టించారు? ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ నేతల ఫొటోలతో ధర్నాలు చేస్తుంటే డీఈవోలు, ఆర్జేడీలు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నిద్రపోతున్నారా? సీఎం, డిప్యూటీ సీఎం సభలకు వేసినట్లు ఐరన్ పెండాల్స్, షామియానాలు, డీజేలు, మైకులతో శాప్ ఎండీ కార్యాలయ ప్రాంగణంలో ధర్నాకు అనుమతి ఎవరు ఇచ్చారు? వారు ఏ సెలవు పెట్టి వచ్చారు? ఏ డిమాండ్ల కోసం వచ్చారో మెమొరాండం ఏమైనా ఇచ్చారా? అవన్నీ బయటపెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తప్పు చేయకపోతే సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు?

పరిపాలన గాలికొదిలి- పెయిడ్ బ్యాచ్ లకు ప్రజాధనం ధారపోత.. 

చంద్రబాబు గారు మీ అబ్బాయి పాపాలను కప్పిపుచ్చుకోవడం మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలని పేర్ని నాని సూచించారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎర్రర్ వచ్చే నకిలీ మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పాలసీ తెచ్చి నెలకు ఒక్కొక్కరికి గరిష్టంగా లక్షన్నర ప్రజాధనాన్ని దోచిపెడుతూ పెయిడ్ బ్యాచ్‌లను మేపుతున్నారని మండిపడ్డారు. కాలేజీ ఫీజు రీయింబర్స్ మెంట్, మెస్ ఛార్జీలు, పథకాలు, రోడ్ల మరమ్మతులు, రైతు ఇన్సూరెన్స్ ప్రీమియంలకు ఖజానా ఖాళీ అంటూనే.. పచ్చ ప్రచారానికి మాత్రం వందల కోట్లు ధారపోయడంపై తీవ్రంగా మండిపడ్డారు.  ప్రజాధనంతో మీడియా సంస్థలను, సోషల్ మీడియాను కొనుగోలు చేసినా ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేరని... మీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది, ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

Back to Top