ఒంగోలు: హైదరాబాద్‌లో గురువారం హఠాన్మరణానికి గురైన వైయస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ పార్థివ దేహానికి ఆయన స్వస్థలమైన ఒంగోలులోని క్లోపేటలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, పలువురు పార్టీ నేతలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు, ఆయన పార్టీకి చేసిన సేవలు స్మరించుకున్నారు. కాకుమాను రాజశేఖర్ మరణం పార్టీకి తీరని లోటని వారు గుర్తు చేశారు. డీఎస్సీలో అక్రమాలపై విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పోలీసులు చేసిన దాడి, వారి తోపులాటల వల్ల రాజశేఖర్ రెండు మూడు సార్లు కింద పడిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఆ దుర్ఘటనే ఆయన మరణానికి ప్రధాన కారణమని పార్టీ నాయకులు, కాకుమాను కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి, కిరాయి సైన్యంలా మారిన పోలీస్ యంత్రాంగ అరాచకాలకు నిదర్శనమని వారు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన యోధుడు కాకుమాను రాజశేఖర్. ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. ఒంగోలు పట్టణంలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన కాకుమాను రాజశేఖర్ నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాడారు. ఇటీవల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. డీఎస్సీలో అక్రమాలపై ఈనెల 22న విజయవాడ, శాప్ ఆఫీస్ వద్ద నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్‌పై పోలీసులు నెట్టివేతలు, తోపులాటకు దిగడంతో ఆయన రెండు సార్లు కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంగోలు చేరుకున్న తర్వాత కూడా పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్న వార్తలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచారు. కూటమి ప్రభుత్వం çసృష్టిస్తున్న ఒత్తిళ్లు, నమోదు చేస్తున్న అక్రమ కేసుల వల్లే ఒక సీనియర్ నేత ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నిరసన గళాన్ని తొక్కేసే క్రమంలో జరిగిన దుర్ఘటన ఇది: సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలే గమనించాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిత్యం చురుగ్గా పనిచేస్తూ, ప్రచార కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన నిజమైన సహచరుడిని (ట్రూ కామ్రేడ్) కోల్పోవడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన ఘోరమైన అక్రమాలపై యువత పక్షాన నిలబడి శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, తప్పును సరిదిద్దుకోవాల్సిన కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేయించింది. ఆ తొక్కిసలాట, పోలీసుల లాఠీఛార్జ్ సమయంలో రాజశేఖర్ పలుమార్లు కిందపడి తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతరం అర్ధరాత్రిళ్లు ఇళ్లపై పడి టెర్రరిస్టుల మాదిరిగా వేధించడంతో విపరీతమైన ఆందోళనకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. అధికారం ఉందని పోలీసు వ్యవస్థను కిరాయి సైన్యంలా వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా దాడులు ప్రభుత్వ హత్యల కిందకే వస్తాయి. అందుకే ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, వారి గూండాయిజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.