తాడేపల్లి : ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. కేవలం ప్రచార ఆర్భాటాలతో లేని అభివృద్ధిని ఉన్నట్లుగా భ్రమింపజేసేందుకు బరితెగించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పథకాలు, అభివృద్ధి అమలు కాక ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, రకరకాల టారిఫ్‌ల పేరుతో ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ’ తీసుకొచ్చి ఐటీడీపీ, యువగళం కార్యకర్తలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని, వారిని నమ్మితే ప్రజలు బొక్కబోర్లా పడతారని వారి అధికార పత్రిక బయటపెట్టి కథనాలు రాసినప్పటికీ.. సిగ్గులేకుండా అదే ఇన్‌ఫ్లుయెన్సర్లను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందని ఆక్షేపించారు. ఫేక్ ఫాలోవర్లతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి చేతనైతే అమరావతి మునక, రాయలసీమ కరవు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంపై ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించే దమ్ముందా అని నిలదీశారు. మరోవైపు తుపానుతో ఉత్తరాంధ్ర అతలాకుతలమై పంటలు మునిగి రైతులు కన్నీరుమున్నీరవుతుంటే.. హోంమంత్రి బాధ్యతారహితంగా బ్యారేజీల వద్ద రీల్స్ చేసుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాపెట్టకుండా రహస్య విదేశీ పర్యటనలకు చెక్కేయడం అత్యంత దుర్మార్గమని పుత్తా శివశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... ప్రచారానికే వందల కోట్ల ప్రజాధనం తగలేస్తున్నారు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలను, అసత్యాలను విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ వాస్తవాలు జనాల్లోకి వెళ్లకుండా తొక్కిపెడుతోంది. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ఉంది. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌కే 2026-27 సంవత్సరానికి బడ్జెట్‌లో సుమారు రూ.330 కోట్లు కేటాయించారు. ఇది చాలదన్నట్లు కాంక్లేవ్‌లు, నేషనల్ మీడియా ప్రచారాల పేరిట వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో, ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను తెచ్చి వాళ్ల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయించాలని చూస్తున్నారు. ప్రజా సంక్షేమానికి మొండిచేయి... పార్టీ వాళ్లకు నెలకు రూ.లక్షన్నర జీతాలా?: "సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల ఊసే లేదు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. వైయస్. జగన్ గారు 80 శాతం పూర్తి చేసిన మెడికల్ కాలేజీలకు రూ.4,000 కోట్లు కేటాయిస్తే పేదలకు వైద్యం, వైద్య విద్య అందుతుంది కదా అంటే మా దగ్గర డబ్బులు లేవని ప్రైవేటీకరిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ అడిగితే ఖజానా ఖాళీ అంటారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబు.. డిగ్రీలు, విద్యార్హతలు లేకుండా కేవలం 10 వేల మంది ఫాలోవర్లు ఉండి రీల్స్ చేసే ఐటీడీపీ కార్యకర్తలకు మాత్రం నెలకు గరిష్టంగా రూ.1.50 లక్షలు ప్రజాధనం దోచిపెడతారా? ఇదేనా నిరుద్యోగులకు మీరు కల్పించే ఉపాధి?. ఫేక్ ఫాలోవర్లను అడ్డం పెట్టుకుని దోపిడీ స్కెచ్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మితే బొక్కబోర్లా పడతారని ప్రభుత్వ అనుకూల పత్రిక ఈనాడే ఆర్టికల్స్ రాస్తోంది. అలాంటి వాళ్లతో ప్రభుత్వం ప్రచారం చేయించాలనుకోవడం సిగ్గుచేటు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో డాలర్లు ఖర్చు పెడితే వేలకొద్దీ ఫేక్ ఫాలోవర్స్, బాట్ లైక్స్ ఇచ్చే మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఏ విధమైన ఆడిట్, జవాబుదారీతనం లేకుండా ఫేక్ అకౌంట్లను చూపించి ఐటీడీపీ వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే ఈ పాలసీ తెచ్చారు. అమరావతి మునక, రాయలసీమ కరువుపై రీల్స్ చేయించే దమ్ముందా?: వరద నీటిలో అమరావతి మునిగిపోతే, రాజమౌళి సినిమా తరహాలో గ్రాఫిక్స్ పెట్టి సుందర నగరమని ప్రచారం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే రాయలసీమలో కరువు విలయతాండవంపై, అమరావతి మునకపై, చేతికందకుండా నాశనమైన పంటలపై, విద్యార్థులకు అందని ఫీజు రీయింబర్స్మెంట్‌పై మీ ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించి నిజాలు మాట్లాడించగలరా? నిజాన్ని మాట్లాడే ప్రతిపక్ష వైయస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను ఇండియాలో కనిపించకుండా బ్లాక్ చేయిస్తున్నారు. ప్రశ్నించే జర్నలిస్టులు, సామాన్యుల ఖాతాలను పోలీసుల ద్వారా మెటా సంస్థకు రాసి తొలగిస్తూ గొంతు నొక్కుతున్నారు. ఉత్తరాంధ్ర మునిగితే సీఎం జంప్.. హోంమంత్రి రీల్స్ సంబరం: ఒకవైపు తుపాను, భారీ వర్షాల ధాటికి ఉత్తరాంధ్ర ప్రాంతం అతలాకుతలమవుతోంది. చేతికచ్చిన పంటలు నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వరద నీళ్లలో కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికితోడు వైయస్. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన ఉచిత పంటల బీమాను కూడా ఈ ప్రభుత్వం ఎత్తేసింది. ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన హోంమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను ఆదుకోకుండా, గొడుగు పట్టుకుని బ్యారేజీ వద్ద నిలబడి రీల్స్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యాకో, స్విట్జర్లాండ్‌కో చెప్పాపెట్టకుండా రహస్యంగా చెక్కేశారు. సీఐడీ అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారో తెలియని దుస్థితి నెలకొంది. కష్టాల్లో ఉన్న ప్రజలను గాలికొదిలేసి పారిపోవడం, పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని సొంత కార్యకర్తలకు దోచిపెట్టడం చంద్రబాబుకే చెల్లిందని పుత్తా శివశంకర్ ఎద్దేవా చేశారు.