వైయస్ఆర్ కడప జిల్లా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి ప్రభుత్వ అరాచకాలకు..వైయస్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య జరుగుతున్నాయని పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశామని, ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎన్నడూ లేదని, ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తారనే భయంతో కుట్రలకు పాల్పడి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ తరఫున మంచి అభ్యర్థులను బరిలో దించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా పనిచేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు, వైయస్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య జరిగే ఎన్నికలుగా ప్రజలు వీటిని చూస్తున్నారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరగలేదని, వైఎస్ జగన్ హయాంలో జరిగిన అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు వైయస్ఆర్‌సీపీ అనుకూలమని, కోర్టు తీర్పుతో రిజర్వేషన్ చెల్లదని తేలినా 50 శాతం స్థానిక సంస్థల సీట్లను బీసీలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు లోబడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారానికి ఇన్‌ఫ్లుయెన్సర్ స్కీమ్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసుల వ్యవహారశైలిపై, న్యాయం జరగడం లేదన్న అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుల నేపథ్యంలో న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలిపారు.