మెగా డీఎస్సీ కాదు... మెగా స్కామ్:

డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి:

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.

డిఎస్సీ పై తొలి సంతకాన్ని తొలి స్కామ్‌గా మార్చేశారు:

కూటమి నేతలకు దమ్ముంటే ఆధారాలతో బహిరంగ చర్చకు రండి : వరుదు కళ్యాణ్ సవాల్

తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు సమాధానం చెప్పలేక పారిపోతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు.ఈ మెగా డీఎస్సీ ఒక 'మెగా స్కామ్' అని,డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలనూ తాము ప్రజల ముందుంచినా, కూటమి నేతలు మాత్రం ఏ తప్పూ జరగలేదంటూ బుకాయిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అసలు అక్రమాలే జరగలేదని భావిస్తే తేదీ, సమయం, వేదిక కూటమి నేతలే నిర్ణయించి, ఆధారాలతో సహా బహిరంగ చర్చకు రావాలని ఆమె సూటిగా సవాల్ విసిరారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ జరిగిన ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాల సమగ్ర నిగ్గు తేల్చేందుకు తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

డీఎస్సీలో భారీ స్కామ్ – లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పద్ధతి ప్రకారం, ఆర్గనైజ్డ్‌గా డీఎస్సీలో స్కామ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాన్ని తొలి స్కామ్‌గా మార్చేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్‌ను కాస్తా 'టీడీపీ రిక్రూట్‌మెంట్'గా మార్చి నిరుద్యోగులను నట్టేట ముంచారు. అసెంబ్లీలో అంతా తానై ఈ డీఎస్సీ విధానాన్ని రూపొందించానని గప్పాలు కొట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూశాక ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? తక్షణమే లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణ అంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?

బట్టబయలైన అక్రమాలు – ప్రశ్నలకు సమాధానమేదీ?.

పేపర్ లీకేజ్: మూడు లక్షల రూపాయలకు 120 బిట్లు అమ్ముకుని కోచింగ్ సెంటర్లకు ఇచ్చారు. నవీన్ అనే వ్యక్తికి లీకేజీ వల్లనే కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా?

టెట్ లేకుండా ఉద్యోగం: సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం టెట్ అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వకూడదు. మరి ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి టెట్ అర్హత సాధించకుండానే ఎలా టీచర్ ఉద్యోగం సాధించాడు?

స్పోర్ట్స్ కోటా దందా: రూ. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. జరగని జూడో టోర్నమెంట్ల సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఫేక్ ఖో-ఖో సర్టిఫికెట్లతో అన్నాచెల్లెళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎంపీ భరత్ అధ్యక్షులుగా ఉన్న అసోసియేషన్ల సంతకాలతో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?

ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ల స్కామ్: నిబంధనలకు విరుద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి అడ్డగోలుగా పోస్టులు కట్టబెట్టారు.

జీవోల మార్పు: అర్హులైన వారికి అన్యాయం చేస్తూ తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవో 47ను సైతం మార్చివేశారు.

ఆధారాలతో వస్తాం... చర్చకు సిద్ధమా?..

నిన్న ప్రెస్ మీట్లలో మాట్లాడిన మహిళా ఎమ్మెల్యేలు ప్రశాంతి, మాధవి రెడ్డి, శిరీష, సౌమ్య, ఇతర నేతలు బొండా ఉమా, చింతమనేని ప్రభాకర్ ఒక్క ఆధారమైనా చూపించారా? వైయ‌స్ఆర్‌సీపీపై బురదజల్లడం తప్ప వాస్తవాలు మాట్లాడలేదు. మేము సూటిగా సవాల్ చేస్తున్నాం... తేదీ, సమయం, వేదిక మీరే నిర్ణయించండి. మీ పార్టీ ఆఫీసో, మా పార్టీ ఆఫీసో చెప్పండి. మేము అన్ని ఆధారాలతో వస్తాం. మీరు ఆధారాలతో రండి. కావాలంటే పేపర్ లీకేజీతో ర్యాంకు తెచ్చుకున్న నవీన్‌ను, టెట్ లేకుండా ఉద్యోగం పొందిన ప్రభాకర్ గౌడ్‌ను, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పొందిన వారిని కూడా మీ వెంట తీసుకురండి. ఆ సర్టిఫికెట్ల బాగోతాన్ని ప్రజల ముందే నిరూపిస్తాం.

జగనన్న హయాంలోనే ఉద్యోగ విప్లవం..

వైయ‌స్.జగన్ మోహన్ రెడ్డి గారిపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సాధించలేనిది, జగనన్న తన ఐదేళ్ల పాలనలో చేసి చూపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 1,35,000 గ్రామ, వార్డు సచివాలయ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన రికార్డు వైయ‌స్.జగన్ దే.

గతంలో టీడీపీ ప్రభుత్వం పరిష్కరించకుండా వదిలేసిన 1998 డీఎస్సీ (4,000 పోస్టులు), స్పెషల్ డీఎస్సీ (1,500), 2008 డీఎస్సీ (2,200), 2018 డీఎస్సీ (8,000) పోస్టులను భర్తీ చేసింది జగనన్న ప్రభుత్వమే. వైయ‌స్. జగన్ ప్రభుత్వంలోనే 6,100 పోస్టులతో డీఎస్సీకి జీవో ఇచ్చాం. అధికారం మారిన తర్వాత మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ చేశారు. డాక్టర్లు, నర్సులు సహా వైద్య రంగంలో ఏకంగా 53,126 శాశ్వత ఉద్యోగాలు, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎంఎస్ఎంఈతో పాటు ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలిపి 40,13,552 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన జగనన్నను విమర్శించే అర్హత మీకు లేదు.

సీబీఐ విచారణ జరిగే వరకు పోరాటం ఆగదు..

ఈ నేపధ్యంలో డీఎస్సీ పరీక్ష రాసి నష్టపోయిన వేలాది మంది అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలని, తప్పు చేయకపోతే ప్రభుత్వం సీబీఐ విచారణకు భయపడాల్సిన అవసరం లేదని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కేవలం అధికారుల బదిలీలతో చేతులు దులుపుకోవాలని చూస్తే కుదరదని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించే వరకు, నిరుద్యోగుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.
 

Back to Top