నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైయస్ఆర్‌సీపీ సాగునీటి కోసం పోరుబాట పట్టింది. శ్రీశైలం నుంచి సోమశిలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో ‘చలో నెల్లూరు బ్యారేజీ’ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి సుమారు 100 కార్లు, బైకులతో భారీ ర్యాలీగా బ్యారేజీ వద్దకు చేరుకున్న నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గకుండా రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసుల అడ్డంకులను దాటి బ్యారేజీని సందర్శించారు. అక్కడే మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సాకె శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. శ్రీశైలంలో నీరున్నా సోమశిలకు నీరు ఎందుకు విడుదల చేయడం లేదు?: కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు “కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసింది. కలువాయి మండలంలోని కనుపూరుపల్లి, నూకనపల్లి, యదనపర్తి, వెరుబొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదు. ‘సెంటు పొలం కూడా ఎండనివ్వం’ అన్న మంత్రుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. శ్రీశైలంలో 871 అడుగుల నీటిమట్టం ఉన్నా సోమశిలకు నీరు ఎందుకు విడుదల చేయడం లేదు? రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల వరకు తరలించే అవకాశం ఉన్నా ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు. సోమశిలలో 17.1 టీఎంసీలు, కండలేరులో 18.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం నీటిమట్టం మరింత పడిపోతే నెల్లూరు జిల్లాకు శాశ్వత కరువు ముప్పు ఏర్పడుతుంది. సోమశిల–కండలేరు ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ద్వారా ఒక్కరోజు నీటిని విడుదల చేసినా కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, సాగు, తాగునీటిపై సమీక్షలు లేవు. తెలంగాణ వైపు రోజూ నీటి వినియోగం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల్లూరు డెల్టా రైతుల నీటి యాజమాన్య హక్కులను కాపాడుతూ శ్రీశైలం నుంచి సోమశిలకు వెంటనే నీటిని విడుదల చేయాలి. జలాశయాల నీటి వివరాలను సెప్టెంబర్ 2 నుంచి ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెబ్‌సైట్‌లో ఎందుకు అప్‌డేట్ చేయడం లేదు? ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియకుండా ఎందుకు దాస్తున్నారు?” - రైతు పోరాటాన్ని అడ్డుకుని ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరు “నెల్లూరు బ్యారేజీ వద్ద నిరసనకు ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో రైతులు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు వెళ్లే ప్రధాన రహదారిలో శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు? ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకున్నారు. ఇరిగేషన్ నిధుల మంజూరు, కేటాయింపులు, వినియోగంపై తక్షణమే విచారణ జరపాలి. రైతుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న తీరుపై సమాధానం చెప్పాలి. నెల్లూరు బ్యారేజీకి వైఎస్సార్ పునాది వేస్తే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పేరు, సంగం బ్యారేజీకి పెట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి గారి పేరును తొలగించడం కూటమి ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు, మీడియాపై తప్పుడు కేసులు, అరెస్టులతో భయపెట్టలేరు. కోవూరులో ఫోర్త్ ఎస్టేట్ సీఈఓ శ్రావణ్ అరెస్టు, అనిల్‌కుమార్ యాదవ్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో రైతు, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపలేరు. ఎమర్జెన్సీ, బ్రిటిష్ కాలం నాటి పాలనను తలపిస్తున్న ఈ కూటమి పాలనకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీరు విడుదల చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు, నాయకులు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.” - ఎల్‌నినో కాదు.. ఎల్లో నిల్ ఎఫెక్ట్: శైలజానాథ్, మాజీ మంత్రి “ఇది ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ఎల్లో నిల్ ఎఫెక్ట్. నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. సోమశిల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తక్షణమే నీటిని తరలించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి. పది రోజులుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే నెల్లూరు బ్యారేజీ వద్ద నిరసన చేపట్టాం. శ్రీశైలం నుంచి సోమశిలకు చుక్క నీరు కూడా ఇవ్వబోమని చంద్రబాబు ప్రకటించడం దారుణం. వాటర్ మేనేజ్‌మెంట్‌లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సోమశిలలో ప్రస్తుతం సుమారు 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో వినియోగానికి అందుబాటులో ఉన్నది సుమారు 8 టీఎంసీలే. పంటలు ఎండిపోతున్నా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.” - శ్రీశైలం నీరు విడుదల చేసే వరకు పోరాటం “శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి వినియోగం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లా రైతులకు అవసరమైన నీటిని విడుదల చేయకుండా ఎందుకు మౌనం వహిస్తోంది? పోతిరెడ్డిపాడు వద్ద నీటిమట్టం పడిపోతే నెల్లూరు జిల్లాకు శాశ్వత కరువు ప్రమాదం ఏర్పడుతుంది. రైతుల పంటలు ఎండిపోతున్న సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించాలి. రాయలసీమ జలాశయాల పరిరక్షణతో పాటు రాష్ట్ర రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించే పోరాటాల్లో వైయస్ఆర్‌సీపీ ముందుంటుంది. నీళ్లు విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.” శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని విడుదల చేసి నెల్లూరు జిల్లా రైతుల పంటలను కాపాడాలని, నెల్లూరు డెల్టా సాగు, తాగునీటి అవసరాలను తక్షణమే తీర్చాలని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. రైతుల కోసం చేపట్టిన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.