స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తా: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. 

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తానే స్వయంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తానని, శక్తి వంచన లేకుండా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ, కూటమి పార్టీల ప్రలోభాలకు ఎవరూ లొంగకుండా, ఎక్కడా రాజీ పడకుండా ధైర్యంగా పోటీ చేయాలని సూచించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అది నిజమైన ప్రజా విజయమని, గత ఎన్నికల్లో ఈవీఎంలు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరగనున్నందున కష్టపడి పనిచేస్తే విజయం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి అధికారపక్ష నాయకుల్లో భయం నెలకొందని, నిద్ర లేవగానే చంద్రబాబు జగన్‌ జపం చేస్తున్నారని బొల్లా బ్రహ్మనాయుడు ఎద్దేవా చేశారు. పక్క పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారికి పదవులు ఇవ్వడం ఆ పార్టీ సంస్కృతిగా మారిందని, సొంత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వైయ‌స్ఆర్‌సీపీ సంస్కృతి అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పింఛన్ల పేరుతో చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరలేపారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు నామమాత్రంగా పింఛన్లు ఇస్తూ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వినుకొండ టౌన్‌ సీఐ ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ పుల్లారావు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు మార్చడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని, పొట్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నామని చెప్పిన ఎమ్మెల్యే అక్కడ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సవాల్‌ విసిరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రెండుసార్లు ఎంపీగా గెలిచినా జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుపైనా విమర్శలు చేసిన బొల్లా, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలే తన బలం, ధైర్యమని, వారి కోసం ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందని, ఎవరికి భయపడకుండా పోటీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు బాసులింగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top