తాడేపల్లి: రాష్ట్రంలో మద్యం వ్యాపారం టీడీపీ సిండికేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. వైన్‌షాపులు, బెల్ట్‌షాపులు, పర్మిట్ రూముల పేరుతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని తెలిపారు. 2024లో మద్యం షాపుల లాటరీకి 89,582 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు వసూలు చేసిన తిరిగి చెల్లించని ఫీజు ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. రెండేళ్ల లైసెన్స్ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్తగా లాటరీ నిర్వహిస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రెన్యూవల్ పేరుతో ఆ ఆదాయాన్ని సిండికేట్లకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3,700కు పైగా మద్యం షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పుత్తా శివశంకర్ అన్నారు. ఎంఆర్పీ ఉల్లంఘనలకు రూ.10 లక్షల వరకు జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని పాలసీలోనే పేర్కొన్నారని, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత జరిమానా వసూలు చేశారు, ఎన్ని షాపుల లైసెన్సులు రద్దు చేశారో ప్రభుత్వం ప్రజలకు లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. బెల్ట్‌షాపులు, పర్మిట్ రూములకు అడ్డూ అదుపూ లేకుండా అనుమతులు ఇస్తూ మద్యం విక్రయాలను పెంచుతున్నారని ఆయన తెలిపారు. ఊరికి రెండు బెల్ట్‌షాపులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, టీడీపీకి చెందిన నాయకులపై కేసులు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ మద్యం సమాచారం ఇచ్చేవారికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఇప్పటివరకు సమాచారం ఇచ్చిన వారికి ఎన్ని బహుమతులు అందించారో, అక్రమ మద్యం విక్రయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలని పుత్తా శివశంకర్ కోరారు. గతంలో టీడీపీ నేతలు ప్రభుత్వ మద్యం విధానంపై చేసిన విమర్శలన్నీ రాజకీయ నాటకమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి సిండికేట్లకు అనుకూలంగా వ్యవస్థను మార్చారని అన్నారు. మద్యం షాపుల ఆటో రెన్యూవల్‌ను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ లాటరీ నిర్వహించాలని, ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికే దక్కేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును సిండికేట్లకు అప్పగించే విధానాన్ని వైయస్ఆర్‌సీపీ అంగీకరించదని పుత్తా శివశంకర్ పేర్కొన్నారు.