విజయవాడ : చిన్నపాటి వర్షానికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీ రోడ్డు, కుండల బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ పరిస్థితులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెలంపల్లి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. వర్షాకాలం వస్తున్నా ప్రధాన కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులు చేయకపోవడంతో చిన్న వర్షానికే డ్రైన్లు పొంగిపొర్లి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. మురుగునీరు, వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైన్లు, కాలువల అభివృద్ధితో పాటు వరద ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. జెండా చెట్టు నుంచి వస్త్రాలత మీదుగా కెనాల్‌లోకి ప్రత్యేక డైవర్షన్ ఛానల్స్ నిర్మించామని, ప్రతి వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేవారమని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల కనీస మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదని అన్నారు. పర్యటన సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, కాలనీల్లో నిలిచిన నీటిని వెంటనే మోటార్లతో తోడివేయాలని, డ్రైన్లలో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.