తాడేపల్లి : తీవ్ర వర్షాభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని గుర్తించి, పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సెప్టెంబర్ 12 నాటికి రాష్ట్రంలో 54 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైందని, మొత్తం 28 జిల్లాలు లోటు వర్షపాతం పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఇందులో అన్నమయ్య, శ్రీ సత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో 60 శాతానికి పైగా లోటు నమోదైందన్నారు. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం లోటు 14 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది సెప్టెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు అంచనా 76.2 లక్షల ఎకరాలు కాగా, 56.38 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి వర్షాధార పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వేరుశనగ సాధారణ సాగులో కేవలం 38 శాతం, మొక్కజొన్న 69 శాతం, పత్తి 80 శాతం, పప్పుధాన్యాలు 89 శాతం మాత్రమే సాగయ్యాయని వివరించారు. రైతుపై పెట్టుబడి భారం.. ఆదాయం మాత్రం తగ్గుదల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, డీజిల్, సాగునీటి ఖర్చులు పెరుగుతున్నా, వర్షాభావం కారణంగా దిగుబడులు తగ్గడంతో రైతుల ఆదాయం పడిపోయిందని నాగిరెడ్డి తెలిపారు. పంటలు సాగు చేసిన రైతులు ఒకవైపు పెట్టుబడులు కోల్పోతుండగా, మరోవైపు పండిన పంటలకు సరైన ధరలు లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన స్థాయిలో ప్రత్యేక కరువు పరిహారం అందించాలని నాగిరెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. రైతులకు ఉపయోగపడిన ఉచిత పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని, కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అన్ని ప్రయోజనాలు అందించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా అత్యవసర సాగునీటి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ప్రచారాలు, ప్రకటనలకు పరిమితం కాకుండా నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయం చేరేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతును ఆదుకుంటేనే వ్యవసాయం, వ్యవసాయం నిలిస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందని పేర్కొన్నారు.