కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు అసహనం, బెదిరింపులు..

దళిత ఐఏఎస్ సునీతపై కక్షసాధింపు చర్యలు దుర్మార్గం

కరవుపై కనిపించని కార్యాచరణ ప్రణాళిక

 ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

డీఎస్సీ స్కామ్‌లో లోకేష్‌ను కాపాడేందుకు అధికారులపై నెపం

 చంద్రబాబు మాయలో ఇరుక్కోవద్దు

 బాబు షూరిటీ అంటే ముమ్మాటికీ దగా గ్యారెంటీ

 వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్ప‌ష్టీకరణ

 తాడేపల్లి: రెండు రోజుల కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనా వైఫల్యాల ఫ్రస్ట్రేషన్‌ను అధికారులపై కక్కేందుకే వేదికగా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటూ నిజాలు మాట్లాడిన దళిత మహిళా ఐఏఎస్ అధికారిణి కే. సునీతను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు పదే పదే అవమానించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఆధారాలతో సహా డీఎస్సీ స్కామ్ బట్టబయలైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను వెనకేసుకొస్తూ, ఆ నెపాన్ని అధికారుల మీదకు నెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 54 శాతం వర్షపాత లోటుతో కరువు తాండవిస్తున్నా రైతులను ఆదుకునే ప్రణాళికలు ప్రకటించని ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ 'జంగిల్ రాజ్' నడుపుతోందని విమర్శించారు. చంద్రబాబు చెప్పే అక్రమాలకు సంతకాలు పెట్టి అధికారులు బలిపశువులు కావద్దని, రాబోయేది వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, తప్పులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సుధాకర్ బాబు హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

దళిత ఐఏఎస్ అధికారిణిపై కక్షసాధింపు చర్యలు

కలెక్టర్ల సదస్సులో ఐఏఎస్ అధికారిణి కే. సునీత గారి పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా పనిచేసిన కాకి మాధవరావు గారి కుమార్తె, నిజాయితీపరురాలైన దళిత అధికారిణి సునీతను ప్రతి సమావేశంలోనూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఆర్‌పీసీ 164 కింద మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినందుకే ఆమెపై ఈ కక్షసాధింపు. డిజైన్ టెక్ నిధుల విడుదల నోట్‌పై సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారని నిజం చెప్పడమే ఆమె చేసిన తప్పా? చంద్రబాబు నాయుడు ఎంత ఎదిగినా ఆయన చూసేది కులమేనని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. ప్రభుత్వానికి అనుకూలంగా తప్పుడు సంతకాలు పెడితే మంచి అధికారి, రూల్స్ మాట్లాడి నిజాయితీగా ఉంటే వేధింపులా? అకౌంటబిలిటీ పేరుతో అధికారులను బహిరంగంగా అవమానించడం క్షమించరాని నేరం.

కూటమి నేతల కోసం జంగిల్ రాజ్ పాలన

కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీల ప్రస్తావన తెచ్చి.. 'మా వాళ్లు వస్తే పనులు అడ్డదిడ్డంగా అయినా చేసి పెట్టండి' అని బహిరంగంగా ఆదేశించడం పరిపాలన నాయకత్వమా లేక బెదిరింపు ధోరణా? ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు తొత్తులుగా మార్చేస్తున్నారు. కూటమి నేతలు ఏ అక్రమం చేసినా వదిలేయాలి, వారిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించాలా? అధికారులను సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్లుగా కాకుండా ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా మార్చేశారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదు, నడుస్తున్నది పూర్తిగా రెడ్ బుక్ ఆధారిత జంగిల్ రాజ్.

డీఎస్సీ స్కామ్‌లో లోకేష్‌ను కాపాడే పన్నాగం

డీఎస్సీలో భారీ ఎత్తున కుంభకోణం బయటపడింది. స్పోర్ట్స్ కోటా పేరిట 382 ఉద్యోగాలను అర్హులను కాదని, లోకేష్ పాదయాత్రకు పనిచేసిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకే అక్రమంగా కట్టబెట్టారు. కో-కోలో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తికి సైన్స్, మ్యాథ్స్ టీచర్ ఉద్యోగం ఇవ్వడం చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తే.. వేలాది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ ఇప్పటికీ ఎందుకు పదవిలో కొనసాగుతున్నారు? ఈ స్కామ్ మొత్తం అధికారుల నెత్తిన వేసి చంద్రబాబు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కరువు సంక్షోభంపై ప్లాన్ శూన్యం

రాష్ట్రంలో 54 శాతం వర్షపాత లోటు ఉందని సీఎం స్వయంగా చెప్పారు. 22 గంటల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించి, కరువును ఎదుర్కొనేందుకు ఒక్క కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేయలేకపోయారు. వర్షపాతం తగ్గితే తాగునీరు, పశుగ్రాసం, పంటల ధరల సంక్షోభం వస్తుందని ప్రభుత్వానికి తెలీదా? ఎన్ని గ్రామాలకు ట్యాంకర్లు కావాలి, ఎన్ని ఫీడర్ క్యాంప్‌లు పెట్టాలి, ప్రైస్ సస్టైనబిలిటీ ఫండ్ ఎంత అనేదానిపై కార్యాచరణ ఏది? కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, కరకట్ట ఇంట్లో కూర్చుని పర్సంటేజీల లెక్కలు వేయడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర రైతాంగం, పేదల సమస్యలపై చంద్రబాబుకు లేదు.

పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ బోగస్ లెక్కలే

రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని నిన్నటి సదస్సులో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే. నైపుణ్యం పోర్టల్ ద్వారా 2.95 లక్షల అవకాశాలు చూపించామని చెప్పిన ప్రభుత్వం.. వాస్తవానికి 4.68 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఇచ్చింది కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమేనని అధికారిక డేటా చెబుతోంది. అధికారిక లెక్కలతోనే చంద్రబాబు మోసం బట్టబయలైంది.

బాబు షూరిటీ అంటే దగా గ్యారెంటీ

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే.. ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనాన్ని అటకెక్కించింది. 2024 జూన్ మొదటి విడత ఎగ్గొట్టారు, రెండో ఏడాది 20 లక్షల మందికి కోత విధించారు, మూడో ఏడాది అతీగతీ లేదు. బాబు షూరిటీ అంటే ముమ్మాటికీ దగా గ్యారెంటీ. పేదవాడికి పెన్షన్లను తెల్లవారుజామునే ఇంటికి పంపిన నాయకుడు వైయ‌స్ జగన్. అలాంటి లబ్ధిదారులను 'పెన్షన్లు తీసుకుని తాగి తందనాలు ఆడుతున్నారు' అంటూ చంద్రబాబు అవమానించడం దుర్మార్గం. పెన్షన్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతలు విధిస్తూ.. ఊరూరా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లతో మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తన స్వార్థం కోసం అధికారులతో తప్పులు చేయించి, విచారణలు రాగానే వారిపైకే నెపాన్ని నెట్టేస్తారని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సంతకాలు పెట్టి ఇరుక్కోవద్దని సూచించారు. రాబోయేది వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని... డీఎస్సీ స్కామ్‌తో సహా ప్రతి అక్రమంపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు మాయలో పడి అధికారులు బలిపశువులు కావద్దని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. 

Back to Top