మదనపల్లె ఓటర్ల జాబితాలో తీవ్ర అక్రమాలు

వార్డుల విభ‌జ‌న‌పై సమగ్ర విచారణ జరిపించాలి

 జిల్లా కలెక్టర్‌కు వైయస్ఆర్‌సీపీ వినతి

 మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో తీవ్ర స్థాయిలో తప్పులు, అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది. వాస్తవంగా ఒక వార్డులో నివసిస్తున్న ఓటర్లను ఎలాంటి సంబంధం లేని ఇతర వార్డులకు మార్చడంతో వారు అయోమయానికి, ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై 164-మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్. నిసార్ అహ్మద్ జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించి తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. తాజాగా విడుదలైన జాబితాలో వాస్తవ నివాస ప్రాంతాలకు సంబంధం లేని వార్డుల్లో పలువురు ఓటర్ల పేర్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని నిసార్ అహ్మద్ తెలిపారు. శ్రీరాములు వీధిలోని ఇంటి నంబర్ 15-50లో నివసించే వి. శ్రీనివాసులు రెడ్డి వాస్తవంగా 13వ వార్డుకు చెందినప్పటికీ 15వ వార్డులో సీరియల్ నంబర్ 1130గా చేర్చారని, అదే ప్రాంతానికి చెందిన శ్రావణ్ రెడ్డిని 14వ వార్డులో సీరియల్ నంబర్ 670గా చూపించారని తెలిపారు. అలాగే ఇంటి నంబర్ 17/89-5-2-2-Bలో నివసిస్తున్న వ్యక్తిని 13వ వార్డులో సీరియల్ నంబర్ 886గా చేర్చినట్లు వివరించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, 13వ వార్డు ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో వాస్తవ నివాస చిరునామాలతో సరిపోల్చి పరిశీలిస్తే మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఆ ప్రాంతానికి సంబంధం లేని వార్డులో ఆయన ఓటును ఎందుకు చేర్చారో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఓటు ఒక వార్డులో ఉండి, నివాసం మరో వార్డులో ఉంటే స్థానిక సమస్యల పరిష్కారం కోసం సంబంధిత ఓటరు ఎవరిని సంప్రదించాలనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. ఓటర్లకు తమ పేర్లు, వార్డు వివరాల్లోని తప్పులను సరిచేసుకునేందుకు స్పష్టమైన సమాచారం, అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం, తగిన వ్యవస్థ కల్పించాలని కోరారు. వైయస్ఆర్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ, పరిశీలనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సరైన సమన్వయం, సంప్రదింపులు జరగడం లేదనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో మాదిరిగానే రాజకీయ పార్టీలను ఓటర్ల జాబితా పరిశీలన, ధృవీకరణ, సవరణలో భాగస్వామ్యం చేయాలని, ప్రజలు కూడా తమ ఓటును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో పరిశీలించుకోవాలని సూచించారు. మదనపల్లె మున్సిపాలిటీ ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ, ప్రతి వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన, ఓటర్లకు అభ్యంతరాలు, సవరణలకు అందుబాటులో ఉండే అవకాశం కల్పించడం, రాజకీయ పార్టీల భాగస్వామ్యం, అవకతవకలకు బాధ్యులైన అధికారులపై చర్యలు, అన్ని తప్పులను సరిచేసి పారదర్శకంగా ధృవీకరించిన జాబితాను ప్రచురించాలని వైయస్ఆర్‌సీపీ కోరింది. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్లను వారి వాస్తవ నివాస ప్రాంతాలకు సంబంధం లేని వార్డులకు మార్చడం వంటి పరిణామాలపై అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నాయకులు తెలిపారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు అన్ని ప్రజాస్వామ్య, శాంతియుత మార్గాల్లో వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి, వి.ఎస్. రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎన్. ఇర్ఫాన్ ఖాన్, గుండ్లూరు రఫీక్, టీఏసీ సభ్యుడు కరీముల్లా, రాజేశ్, ఈశ్వర్ నాయక్, శ్రీనివాసులు, పాల్ చంద్రశేఖర్, ఆంజనేయులు, మాధవ రెడ్డి, సోషల్ మీడియా కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, గ్రానైట్ మహేశ్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, బయ్యారెడ్డి, బొమ్మిశెట్టి మధు, నాగిరెడ్డి, సాంబశివారెడ్డి, ఆవుల విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, షేక్ జబి, నూర్ మొహియుద్దీన్ ఖాన్, నరసింహులు, శారదా రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top