హెచ్‌ఎల్‌సీ దిగువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి

రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన డాక్టర్ సాకే శైలజనాథ్

అనంతపురం: శింగనమల నియోజకవర్గంలోని హెచ్‌ఎల్‌సీ కాలువల దిగువ ఆయకట్టు ప్రాంతాలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, సుబ్బరాయసాగర్‌కు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ రైతులు, పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఎండిన పంటలను చేతబట్టి వినతిపత్రం సమర్పించారు. హెచ్‌ఎల్‌సీ నీరు ఎం.పి.ఆర్. డ్యామ్ దక్షిణ కాలువ ద్వారా ప్రతి ఏటా ఆయకట్టు రైతులకు అందుతున్నప్పటికీ, ఈసారి హెచ్‌ఎల్‌సీ దిగువ ప్రాంతంలోని శింగనమల నియోజకవర్గానికి నీరు అందించేందుకు అవకాశం లేదనే నిర్ణయం రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. హెచ్‌ఎల్‌సీ నీరు ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, వేలాది మంది రైతుల జీవనాధారమని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లోకి వచ్చినా తగిన వర్షాలు లేక బోర్లు ఎండిపోతున్నాయని, మెట్ట భూముల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఉందని, ఇప్పటికే సాగులో ఉన్న చీని, ఇతర ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తూ ఒక్కో ట్యాంకర్‌కు సుమారు రూ.900 వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు, పశువులకు కూడా తాగునీటి సమస్య తీవ్రంగా మారిందన్నారు. శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదలవుతున్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసి హెచ్‌ఎల్‌సీ చివరి ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరారు. హెచ్‌ఎల్‌సీ ఎగువ ప్రాంతంలోని కర్ణాటక పరిధిలో ఆరుతడి పంటలకు 90 రోజులపాటు నీరు అందించే అవకాశం ఉన్నప్పుడు దిగువ ప్రాంత రైతులకు నీరు ఎందుకు అందించకూడదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. జీవో నంబర్‌ 3 ప్రకారం ఎల్‌ఎల్‌సీ నుంచి కనీసం 5 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

శింగనమల నియోజకవర్గానికి రావాల్సిన హెచ్‌ఎల్‌సీ నీటిని సక్రమంగా, న్యాయబద్ధంగా అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, దిగువ ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డాక్టర్ సాకే శైలజనాథ్ కోరారు. ఎం.పి.ఆర్. డ్యామ్ నీటి లభ్యత, నిల్వలు, విడుదల, ఆయకట్టు పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, నీటి పంపిణీలో అంతరాయం లేదా అన్యాయమైన మళ్లింపులు ఉంటే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నీటి కొరతతో ఎండిపోతున్న ఉద్యాన పంటలను కాపాడేందుకు అత్యవసర నీటి సరఫరా, ట్యాంకర్ సదుపాయం కల్పించాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి పశువులకు నీరు అందించాలని కోరారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, నీటి లభ్యత, కాలువల పరిస్థితి, ఆయకట్టు పరిధి, విడుదల వివరాలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న డిమాండ్ కాదని, రైతు బతుకు, ప్రజల తాగునీరు, పశువుల ప్రాణాలు, సింగనమల ప్రాంత భవిష్యత్తు కోసం చేస్తున్న విజ్ఞప్తి అని స్పష్టం చేశారు. నీరు ఉన్న చోటికి నీరు వెళ్తున్నప్పుడు నీటి కోసం ఎదురుచూస్తున్న సింగనమల రైతులకు కూడా న్యాయం జరగాలని, సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోవడం రైతు తప్పు కాదని అన్నారు. “నీరు రైతు హక్కు – రైతు బతుకు ప్రభుత్వ బాధ్యత” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర నాయకులు బొమ్మన శ్రీరామ్ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, బోగాతి ప్రతాపరెడ్డి, సరిబాల ప్రతాప్ రెడ్డి, ఐటీ విభాగం జోనల్ అధ్యక్షులు మంజునాథ్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చామలూరు రాజగోపాల్, అంకె ముసలన్న, గువ్వల శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పద్మావతి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, కాటమయ్య, ఆంజనేయులు, నాగలింగారెడ్డి, పుల్లారెడ్డి, కొండ్రెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పనింద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top