ఒక్కొక్కటిగా బయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు

సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల్సిందే

వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి  

కర్నూలు: కూటమి ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మంత్రి నారా లోకేష్ స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారని, తన పాదయాత్రలో పాల్గొన్న వారికి రిటర్న్ గిఫ్ట్‌గా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కౌతాళం మండలంలో ప్రభాకర్ అక్రమ నియామకం, షేక్ ఇమామ్–కరిష్మా దంపతులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు, విశాఖలో అన్నాచెల్లెళ్లకు టెట్ రాయకుండానే ఉద్యోగాలు, హోలగుందలో టెట్ లేకుండా తెలుగు పండిట్ ఉద్యోగం వంటి అంశాలు బయటకు వచ్చాయని తెలిపారు. ఒక పోస్టును రూ.14 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని, 2018లో బీసీ-బీ కింద డీఎస్సీ రాసిన వ్యక్తి 2025లో ఈబీసీ కింద ఎలా డీఎస్సీ రాశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. స్పోర్ట్స్ ఆడని వారికి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారికి ఉద్యోగాలు ఎలా వచ్చాయని నిలదీశారు.

డీఎస్సీ నియామకాలపై సుమోటోగా సీబీఐ విచారణ చేపట్టాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అక్రమాలు బయటపడితే లోకేష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే భయంతోనే సీబీఐ విచారణకు ప్రభుత్వం వెనుకాడుతోందని అన్నారు. చంద్రబాబు చర్చకు వస్తే వైయ‌స్ జగన్ చర్చకు సిద్ధంగా ఉన్నారని, బెంజ్ సర్కిల్‌లోనైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. జగన్‌తో చర్చించే స్థాయి లోకేష్‌కు లేదన్నారు. జూడో టోర్నమెంట్ నిర్వహించకుండా ఆ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆధారాలతో అక్రమాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల్లో కూటమి నేతల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ విచారణ జరపకపోతే కేంద్రానికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతాయని అన్నారు. జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ఎవరూ వేలెత్తి చూపే అవకాశం లేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో డీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
 

Back to Top