తాడేపల్లి: నిరుద్యోగ యువత భవిష్యత్తును రోడ్డున పడేస్తూ, అనర్హులకు, ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి పెద్దపీట వేసిన డీఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేష్ పూర్తి బాధ్యత వహించాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై మంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. పేపర్ లీకేజీలు, పోస్టుల విక్రయం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డీఎస్సీ పరీక్షల నిర్వహణను భ్రష్టుపట్టించి ఉద్యోగాలను మార్కెట్లో అమ్ముకునే స్థాయికి వ్యవహారం చేరిందని సజ్జల తెలిపారు. బాధితులు ప్రతిరోజూ రోడ్డెక్కి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా బాధ్యత గల మంత్రిగా స్పందించాల్సిన లోకేష్ దబాయింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన నోటిఫికేషన్లను పక్కనబెట్టి మెగా డీఎస్సీ పేరుతో భారీ అక్రమాలకు తెరలేపారని, దీనిపై ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ సోషల్ మీడియాలో సెన్సార్‌షిప్‌కు పాల్పడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ మెగా కుంభకోణంపై తక్షణమే సమగ్రమైన సీబీఐ విచారణ జరిపితేనే 3.5 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మార్కెట్లో టీచర్ ఉద్యోగాల విక్రయం రాష్ట్రంలో మెగా డీఎస్సీ జరిగిన తీరు చూస్తుంటే ఇది సాధారణ నియామక ప్రక్రియలా కనిపించడం లేదని సజ్జల అన్నారు. టీచర్ ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకున్నారనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని, ప్రతిరోజూ కొత్త పేర్లు, కొత్త అక్రమాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. అడ్డదారుల్లో కొందరికి ఏ విధంగా ఉద్యోగాలు కట్టబెట్టారనే విషయాలను బాధితులు బహిరంగంగా చెబుతున్నారని, అసలు ఇది రిక్రూట్‌మెంట్ అనడానికి వీల్లేదని అన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను పక్కనబెట్టి మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను అమ్ముకునే స్థాయికి వ్యవహారం చేరిందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడ నిబంధనలు పాటించారు? ఎక్కడ ఉల్లంఘించారు? ఎవరి నిర్ణయంతో ఏ మార్పులు జరిగాయి? అనే అంశాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కుంభకోణానికి ప్రధాన సూత్రధారి మంత్రి నారా లోకేష్ డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీలపై వస్తున్న ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలని సజ్జల కోరారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని భావిస్తే పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని స్పష్టం చేశారు. ఇన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నా స్పందించకుండా కాలం వెళ్లదీస్తున్న లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలంటే మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని తెలిపారు. జూడో సర్టిఫికెట్లపై తీవ్ర వివాదం స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జూడో సర్టిఫికెట్ల వ్యవహారం అత్యంత తీవ్రమైనదని సజ్జల తెలిపారు. ఖమ్మంలో జూడో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ పేరుతో ఎలాంటి టోర్నమెంట్ జరగకపోయినా సుధారాణి, చంద్రానాయక్, రియాజుల్లా, కాకోజీ పాండు అనే నలుగురు అభ్యర్థులు అందులో పాల్గొని పతకాలు సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్లు తేలిందని చెప్పారు. ఖమ్మం డిస్ట్రిక్ట్స్ జూడో అసోసియేషన్ తాము సంతకాలు చేయలేదని, ఆ తేదీల్లో ఎలాంటి ఈవెంట్ జరగలేదని స్పష్టం చేసిందని తెలిపారు. ఒకే ఈవెంట్‌కు సంబంధించినవిగా చెబుతున్న సర్టిఫికెట్లలో తేదీలు, లోగోలు, నమూనాలు వేర్వేరుగా ఉండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు? ఎవరు వెరిఫై చేశారు? ఈవెంట్ జరిగిన ప్రదేశం, తేదీ, పాల్గొన్న క్రీడాకారులు, నిర్వాహక సంస్థ వివరాలన్నింటినీ పరిశీలించాలని కోరారు. సర్టిఫికెట్లు జారీ చేసిన వారి నుంచి వెరిఫికేషన్ చేసిన అధికారుల వరకు అందరి పాత్రపై విచారణ జరగాలని స్పష్టం చేశారు. నవీన్, ఎస్‌సీఈఆర్టీ, కోచింగ్ సెంటర్లపై సమగ్ర దర్యాప్తు అవసరం ప్రశ్నపత్రాల వ్యవహారంలో ఎస్‌సీఈఆర్టీలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ప్రస్తావనకు వస్తోందని సజ్జల తెలిపారు. కోచింగ్ సెంటర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రశ్నపత్రానికి సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి బయటకు వెళ్లింది? ఎవరి ద్వారా వెళ్లింది? ఎవరికి చేరింది? ఏ కోచింగ్ సెంటర్లకు చేరింది? డబ్బు లావాదేవీలు జరిగాయా? అనే అంశాలపై దర్యాప్తు జరగాలని అన్నారు. ప్రశ్నపత్రాల ముద్రణ, భద్రత, పంపిణీ, పరీక్షా కేంద్రాల వరకు మొత్తం వ్యవస్థను దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో వెలుగు చూసిన అక్రమాలు కర్నూలు, కడప జిల్లాల్లో వెలుగు చూసిన డీఎస్సీ అక్రమాలను ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించే పరిస్థితికి వచ్చిందని సజ్జల అన్నారు. గతంలో ఆర్డీవోలు ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టి, మీడియా ద్వారా విషయాలు బయటకు వచ్చిన తర్వాత సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. టెట్, డిగ్రీ అర్హతలు లేనివారికి నియామకాలు టెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని వారికి, ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ అర్హత కూడా లేని వారికి పోస్టులు ఇచ్చిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయని సజ్జల తెలిపారు. బీసీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసిన వారు ఆ తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్ కింద సర్టిఫికెట్లు మార్చుకుని ఉద్యోగాలు పొందిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లలో భారీ బోగస్ దందాలు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన వారిలో చాలామంది సర్టిఫికెట్లు బోగస్‌గా తేలుతున్నాయని సజ్జల తెలిపారు. అసలు ఈవెంటే జరగలేదని సంబంధిత సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం వారిని వెనకేసుకొస్తోందని అన్నారు. ఒకే ఈవెంట్‌కు వేర్వేరు తేదీలు, వేర్వేరు లోగోలతో సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందిన వ్యవహారాలు బయటపడుతున్నాయని తెలిపారు. ఇది ఒక పెద్ద నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా జరిగిందనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే చిన్నపాటి విచారణతో అసలు నిజాలు బయటకు రావని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. నారా లోకేష్ సీబీఐ విచారణకు సిద్ధపడాలి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వైయస్ జగన్ గారిపై ఆరోపణలు వచ్చినప్పుడు వైయస్‌ఆర్ స్వయంగా సీబీఐ విచారణను ఆహ్వానించారని సజ్జల గుర్తుచేశారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు నిజాయితీ ఉంటే తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే సీబీఐ విచారణను బహిరంగంగా అంగీకరించాలని సవాల్ చేశారు. తప్పు చేయనప్పుడు రికార్డులు బయటపెట్టండి వైయస్ఆర్‌సీపీ చేస్తున్న ఆరోపణలు తప్పయితే రికార్డులు బయటపెట్టి నిజాలను ప్రజలకు చూపించాలని సజ్జల అన్నారు. అర్హతలు సరిగ్గా ఉన్నాయని చెబుతున్నారా? ఒరిజినల్ వెరిఫికేషన్ రికార్డులు చూపించాలని కోరారు. ప్రశ్నపత్రాల భద్రతలో ఎలాంటి లోపం లేదని చెబితే మొత్తం ప్రక్రియను ప్రజలకు వివరించాలని అన్నారు. అధికారులు, ఫైల్ నోటింగ్స్, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలించాలని కోరారు. డీఎస్సీ మొత్తం పారదర్శకంగా జరిగిందని చెబుతున్నప్పుడు స్వతంత్ర దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రతి అభ్యర్థి వివరాలు, వెరిఫికేషన్ రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, రహస్యంగా పోస్టులు కట్టబెట్టిన వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు. సీబీఐ విచారణతోనే నిరుద్యోగులకు నిజమైన న్యాయం మెగా డీఎస్సీ అక్రమాలపై సమగ్రమైన సీబీఐ విచారణ జరిపితేనే అసలు సూత్రధారులు ఎవరో బయటపడతారని సజ్జల తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపిన విషయాన్ని, హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కోర్టు విచారణలో దోషులుగా తేలిన విషయాన్ని ప్రస్తావించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడక తప్పదని అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సజ్జల సూటి ప్రశ్నలు * సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏ విధంగా జరిగింది? * అర్హత లేని అభ్యర్థులకు పోస్టులు వచ్చాయనే ఆరోపణలపై పూర్తి వివరాలు ఏమిటి? * వివాదాస్పద స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేశారు? వాటిని అధికారులు ఏ విధంగా ధ్రువీకరించారు? * ప్రశ్నపత్రాల భద్రత, పంపిణీ వ్యవస్థపై పూర్తి బాధ్యత ఎవరిది? * ఎస్‌సీఈఆర్టీ నుంచి పరీక్షా వ్యవస్థ వరకు ఎవరి బాధ్యత ఏమిటి? * ఫిర్యాదులు ముందే అందితే వాటిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? * తప్పులు జరిగాయని గుర్తించిన తర్వాత కూడా సంబంధిత నియామకాలను ఎందుకు సమీక్షించలేదు? * నగదు లావాదేవీలు జరిగాయా లేదా అనే అంశంపై దర్యాప్తు ఎందుకు జరగకూడదు? * మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పడంతో పాటు స్వతంత్ర సీబీఐ దర్యాప్తుకు ముందుకు రావాలని సజ్జల స్పష్టం చేశారు. నిజంగా కష్టపడి చదివి ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు.