డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్ నియామకాల్లోనూ భారీ బేరసారాలు

వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధ్వజం

పారదర్శకతకు పాతరేసి ఫలితాలు దాచేశారు

కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అక్రమాలపైనా విచారణ జరపాలి: పానుగంటి చైతన్య

గతంలో లేని విధంగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులు ఎలా వచ్చాయి?

ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర

వైయ‌స్ జగన్ హయాంలో 6,100 పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం

నాడు కోర్టుల ద్వారా అడ్డుకుని నేడు క్రెడిట్ చోరీకి యత్నం

చిత్తశుద్ధి ఉంటే కొత్తగా 20 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి: రవిచంద్ర

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రతి నియామక ప్రక్రియలోనూ తీవ్రమైన అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. వైయ‌స్ జగన్ హయాంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ నిర్వహించారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈవెంట్స్ వాయిదా పడిన సమయంలో కోర్టు కేసుల ద్వారా నియామక ప్రక్రియను అడ్డుకున్నారని తెలిపారు. ఇప్పుడు అదే పోస్టులను తామే భర్తీ చేసినట్లు కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో 79 బ్యాక్‌లాగ్ పోస్టుల పేరుతో సవరణలు తీసుకురావడం, అభ్యర్థుల పూర్తి వివరాలను వెల్లడించకుండా సెలక్షన్ లిస్ట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

పానుగంటి చైతన్య మాట్లాడుతూ డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్ నియామకాల్లోనూ పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించామని, కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సెలక్షన్ లిస్ట్‌లో కేవలం రిజిస్ట్రేషన్ నంబర్, పేరు మాత్రమే ఉంచి ఇతర వివరాలను ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. గతంలో తండ్రి పేరు, లింగం, పుట్టిన తేదీ, కులం, ఎత్తు, ఛాతీ కొలతలు వంటి వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచేవారని తెలిపారు. వైయ‌స్ జగన్ 2022 నవంబర్ 28న విడుదల చేసిన జీవోను సవరించి స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి ఎందుకు పెంచారో, అకస్మాత్తుగా 79 బ్యాక్‌లాగ్ పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఆ పోస్టులను ఏ కేటగిరీకి, ఎవరికి కేటాయించారో వెల్లడించాలని, డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రవిచంద్ర మాట్లాడుతూ పోలీస్ నియామకాల్లో గతంలో లేని బ్యాక్‌లాగ్ విధానాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారో లోకేష్, హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైయ‌స్ జగన్ నోటిఫికేషన్‌లో లేని 79 పోస్టులను సవరణ ద్వారా ఎవరి కోసం ఏర్పాటు చేశారో నిరుద్యోగులకు వివరించాలని కోరారు. 6,100 పోస్టులకు 5,03,486 మంది దరఖాస్తు చేసుకోగా, 4,59,182 మంది ప్రిలిమ్స్ రాశారని తెలిపారు. ఫైనల్ రాత పరీక్ష రాసిన 38,914 మంది అభ్యర్థుల మార్కులు, కేటగిరీ, ర్యాంకులు, ఈవెంట్స్ వివరాలను ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచలేదని ప్రశ్నించారు. మెరిట్ లిస్ట్ లేకుండా ఫలితాలను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభలో హామీ ఇచ్చిన విధంగా 20 వేల కొత్త పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు.
 

Back to Top