డీఎస్సీ అక్రమాలకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ లోకేష్‌దే!

పేపర్‌ లీకేజీల నుంచి పోస్టుల విక్రయం వరకు సమగ్ర దర్యాప్తు జరగాలి.. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?

 మేం చెబుతున్నది అబద్ధమైతే రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధపడాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్  సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు రోజురోజుకూ మరింత వెలుగులోకి వస్తున్నాయని, పేపర్‌ లీకేజీల నుంచి పోస్టుల విక్రయం వరకు చోటుచేసుకున్న వ్యవహారాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పూర్తి బాధ్యత వహించాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీని సాధారణ నియామక ప్రక్రియగా కాకుండా టీచర్‌ పోస్టులను బహిరంగ మార్కెట్లో విక్రయించే స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. టెట్‌ అర్హత లేని వారితో పాటు కొన్ని సందర్భాల్లో సంబంధిత డిగ్రీ అర్హత కూడా లేని వారికి పోస్టులు కట్టబెట్టారని, కర్నూలు, కడప జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలను ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. 

టీచర్‌ పోస్టులు మార్కెట్లో అమ్ముకున్నారా?

మెగా డీఎస్సీ జరిగిన తీరు చూస్తుంటే ఇది సాధారణ నియామక ప్రక్రియగా కనిపించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘క్యాష్‌ ఫర్‌ టీచర్‌ పోస్ట్‌’ తరహాలో డబ్బులకు టీచర్‌ ఉద్యోగాలు అమ్ముకున్నారనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. రోజుకో కొత్త పేరు, రోజుకో కొత్త అక్రమం వెలుగులోకి వస్తోందని, అడ్డదారుల్లో కొందరికి ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో బాధితులు బహిరంగంగా చెబుతున్నారని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ నుంచి నియామకాల వరకు ఎక్కడ నిబంధనలు పాటించారు, ఎక్కడ ఉల్లంఘించారు, ఎవరి నిర్ణయంతో మార్పులు జరిగాయనే విషయాలన్నీ బయటకు రావాలని స్పష్టం చేశారు. 

కుంభకోణానికి ప్రధాన సూత్రధారి లోకేష్‌: సజ్జల

డీఎస్సీ అక్రమాలకు, పేపర్‌ లీకేజీలకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌దేనని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. నిజంగా నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ లేవనెత్తిన ప్రశ్నలకు పాయింట్‌ టు పాయింట్‌ సమాధానం ఇవ్వాలని సవాల్‌ చేశారు. ఇన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నా స్పందించకుండా కాలయాపన చేస్తున్న లోకేష్‌ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

జూడో సర్టిఫికెట్లపై తీవ్రమైన అనుమానాలు

స్పోర్ట్స్‌ కోటాలో జూడో సర్టిఫికెట్ల వ్యవహారం కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని సజ్జల తెలిపారు. ఒకే ఈవెంట్‌కు సంబంధించినవిగా చెబుతున్న సర్టిఫికెట్లలో తేదీలు, లోగోలు, నమూనాలు వేర్వేరుగా ఉండటంపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. అసలు ఈవెంట్‌ జరిగిందా, ఎవరు పాల్గొన్నారు, సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు, వాటిని అధికారులు ఎలా ధ్రువీకరించారనే వివరాలు బయటకు రావాలని కోరారు. జూడో అసోసియేషన్‌ పేరుతో తాజాగా వచ్చిన లేఖతో పాటు ఒరిజినల్‌ రికార్డులు, ఈవెంట్‌ వివరాలు, పాల్గొన్న క్రీడాకారులు, నిర్వాహక సంస్థలను పూర్తిగా పరిశీలించాలని స్పష్టం చేశారు. 

 ప్రశ్నపత్రాల భద్రతపైనా సమగ్ర దర్యాప్తు అవసరం

ఎస్‌సీఈఆర్టీలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌ పేరు ప్రశ్నపత్రాల వ్యవహారంలో ప్రస్తావనకు వస్తోందని సజ్జల తెలిపారు. కోచింగ్‌ సెంటర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రశ్నపత్రం లేదా పరీక్షకు సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి బయటకు వెళ్లింది, ఎవరి ద్వారా వెళ్లింది, ఎవరికి చేరింది, ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా అనే అంశాలపై దర్యాప్తు జరగాలని అన్నారు. ఎస్‌సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రాల ముద్రణ, భద్రత, పంపిణీ, పరీక్షా కేంద్రాల వరకు మొత్తం వ్యవస్థను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

 టెట్‌, డిగ్రీ అర్హతలు లేనివారికి ఉద్యోగాలా?

టెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించని వారికి, కొన్ని సందర్భాల్లో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ అర్హత కూడా లేని వారికి పోస్టులు ఇచ్చినట్లు అంశాలు వెలుగులోకి వచ్చాయని సజ్జల తెలిపారు. బీసీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసిన వారు తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ కింద సర్టిఫికెట్లు మార్చుకుని ఉద్యోగాలు పొందిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో అసలు ఈవెంట్లు జరగకపోయినా జరిగినట్లు చూపించి, వేర్వేరు తేదీలు, లోగోలతో సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందిన వ్యవహారాలపై కూడా సమగ్ర విచారణ జరగాలని అన్నారు. 

 ప్రభుత్వ పరిధిలో విచారణతో నిజాలు బయటపడవు

డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అంతర్గత విచారణలతో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలో జరిగే విచారణపై అనేక సందేహాలు ఉన్నాయని, అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగాలని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ చెబుతున్న అంశాలు తప్పైతే రికార్డులు బయటపెట్టి ప్రజల ముందు నిరూపించాలని సవాల్‌ చేశారు. అర్హతలు సరిగ్గా ఉన్నాయంటే వాటికి సంబంధించిన రికార్డులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, ప్రశ్నపత్రాల భద్రతా ప్రక్రియను ప్రజలకు వెల్లడించాలని కోరారు. 

 సీబీఐ విచారణతోనే నిరుద్యోగులకు న్యాయం

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపితేనే అసలు సూత్రధారులు ఎవరో బయటపడతారని సజ్జల స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది నిరుద్యోగులకు నిజమైన న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తే మార్గమని అన్నారు. వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వైయ‌స్‌ జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ విచారణను స్వయంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే నారా లోకేష్‌ కూడా సీబీఐ విచారణను బహిరంగంగా అంగీకరించాలని సవాల్‌ చేశారు. 

 సజ్జల సూటి ప్రశ్నలు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఏ విధంగా జరిగింది? అర్హత లేని అభ్యర్థులకు పోస్టులు వచ్చాయనే ఆరోపణలపై పూర్తి వివరాలు ఏమిటి? వివాదాస్పద స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేశారు, అధికారులు వాటిని ఎలా ధ్రువీకరించారు? ప్రశ్నపత్రాల భద్రత, పంపిణీ వ్యవస్థకు పూర్తి బాధ్యత ఎవరిది? ఫిర్యాదులు ముందే అందినా చర్యలు ఎందుకు తీసుకోలేదు? తప్పులు గుర్తించిన తర్వాత సంబంధిత నియామకాలను ఎందుకు సమీక్షించలేదు? నగదు లావాదేవీలు జరిగాయా లేదా అనే అంశంపై దర్యాప్తు ఎందుకు జరగకూడదు? మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని సజ్జల ప్రశ్నించారు. 

డీఎస్సీ నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించే వారి గొంతులను అణచివేసినా, సామాజిక మాధ్యమాల్లో నియంత్రణలు విధించినా బయటపడుతున్న ఆధారాలను ఆపలేరని అన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.
 

Back to Top