‘చంద్రబాబు వాటర్‌మెన్‌ కాదు.. క్వార్టర్‌మెన్‌’

మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారు

స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి

విశాఖలో పార్టీ నేతల విస్తృత సమావేశం

విశాఖపట్నం: చంద్రబాబు వాటర్‌మెన్‌ కాదు.. క్వార్టర్‌మెన్‌.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. విశాఖ నగరంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్‌ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్‌ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారని, వేలాది బోర్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? అని ప్రశ్నించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు.

చంద్రబాబు నైజం యూజ్‌ అండ్‌ త్రో పాలసీ: కన్నబాబు

కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైయ‌స్ఆర్‌సీపీది వెన్ను చూపని పార్టీ అని పేర్కొన్నారు.

యాదవ సామాజిక వర్గానికి చెందిన సాధారణ మహిళను వైయ‌స్‌ జగన్‌ జీవీఎంసీ మేయర్‌గా చేశారని, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్‌ పీఠం నుంచి దించేశారని తెలిపారు. చంద్రబాబు నైజం యూజ్‌ అండ్‌ త్రో పాలసీ అని పేర్కొన్నారు.

రిషికొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారని, కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారని ఆరోపించారు. రూపాయికి చాక్లెట్‌ కూడా రాదని, అలాంటిది ఎకరా భూమిని 99 పైసలకు ఇచ్చేస్తున్నారని పేర్కొన్నారు.

మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చేవాడు వాటర్‌మెన్‌ ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెన్షన్లు తీసుకునే వారిని చంద్రబాబు తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారని, పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని కన్నబాబు ఆరోపించారు.

అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కళ్యాణి

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, మూడేళ్లలో కేవలం రూ.32 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి: కేకే రాజు

విశాఖ నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

వైయ‌స్‌ జగన్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. చెప్పిన హామీల కంటే ఎక్కువగా వైయ‌స్‌ జగన్‌ అమలు చేశారని, విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.

యాదవులకు విశాఖ మేయర్‌ పదవిని వైయ‌స్‌ జగన్‌ ఇచ్చారని, జీవీఎంసీలో కీలకమైన పదవులను బడుగు, బలహీన వర్గాలకు అందించారని కేకే రాజు వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Back to Top