నీళ్లు లేక ఎండిపోయిన పంటలు.. రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకం

  ఇది ఎండిపోయిన తోటలు కాదు.. రైతు కన్నీళ్లతో ఎండిపోయిన భవిష్యత్తు

  శింగనమలలో ఎండిపోయిన పంటలు, పండ్ల తోటలను పరిశీలించిన డా. సాకే శైలజానాథ్

 హెచ్‌ఎల్‌సీ దిగువ ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించాలి

శింగనమల: నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, పండ్ల తోటలను చూస్తుంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామాల్లో రైతులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, పండ్ల తోటలను పరిశీలించారు.

ఏళ్ల తరబడి కష్టపడి పెంచుకున్న పండ్ల తోటలు నీరు అందక కళ్ల ముందే ఎండిపోతుంటే రైతు పడే బాధను మాటల్లో చెప్పలేమని శైలజానాథ్ పేర్కొన్నారు. ఒక్కో మొక్క వెనుక రైతు పెట్టుబడి, అప్పు, కుటుంబ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నాయని తెలిపారు. నీళ్లు ఉన్న ప్రాంతాలకు నీరు వెళ్తున్నప్పుడు మిగతా ప్రాంతాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని కోరారు. కాగితాలపై ఉన్న లెక్కలను కాకుండా, నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, పండ్ల తోటలను స్వయంగా పరిశీలించాలని సూచించారు. హెచ్‌ఎల్‌సీ కాలువల దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

నీరు అందక పంటలు, పండ్ల తోటలు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నష్టపరిహారం అందించాలని కోరారు. రైతు తోట ఎండిపోతే అది ఒక్క రైతుకు జరిగిన నష్టం కాదని, ఒక కుటుంబం భవిష్యత్తు ఎండిపోవడమేనని పేర్కొన్నారు.

“మన ప్రాంతానికి మన నీళ్లు ఇవ్వాలి. రైతు తోటలను కాపాడాలి. రైతు కుటుంబాలను ఆదుకోవాలి” అని శైలజానాథ్ స్పష్టం చేశారు.

రైతు నీళ్ల కోసం అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం మాటలతో కాలం వెళ్లదీస్తోందని, రైతులకు మాటలు కాదు.. నీళ్లు కావాలని, హామీలు కాదు.. చర్యలు కావాలని అన్నారు. ఈ ప్రాంత రైతుల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, మన ప్రాంతానికి నీళ్లు వచ్చే వరకు ప్రశ్నిస్తామని, రైతు తోటలు బతికే వరకు పోరాడతామని తెలిపారు. రైతు కన్నీళ్లు ఆగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

  పెట్టుబడి పెట్టి పంటను కోల్పోయాం: రైతు కొండారెడ్డి

రైతు కొండారెడ్డి మాట్లాడుతూ 18 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశానని, అయితే బోర్లలో నీరు రాక సకాలంలో పంటకు నీరు అందించలేక పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  అప్పులు చేసి సాగు చేశాను.. పంట చేతికి వచ్చే సమయానికి ఎండిపోయింది: సరస్వతి

రైతు సరస్వతి మాట్లాడుతూ 3.5 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశానని తెలిపారు. పిల్లలను చదివించుకోవాలనే ఆశతో అప్పు చేసి మరీ పంట సాగు చేశానని చెప్పారు. పంటల్లో నష్టం రావడంతో తన భర్త అప్పుల బాధతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.60 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు.

 కాపు వచ్చిన సమయంలోనే చీని తోట ఎండిపోయింది: వెంకటరామిరెడ్డి

చీని రైతు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఆరు ఎకరాల్లో చీని తోట సాగు చేశానని తెలిపారు. బోర్లలో నీరు అడుగంటిపోవడంతో కాపు వచ్చిన సమయంలోనే చెట్లు పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టామని, అప్పులు చేసి సాగు చేసిన పంటలతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సరిబాల ప్రతాప్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, భాస్కర్‌రెడ్డి, ఉట్టి కాటమయ్య, నాగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మంజునాథ్, శ్యాంసుందర్‌రెడ్డి, మాంజనేయులు, సురేష్‌బాబు, లక్ష్మిరెడ్డి నాగరాజు, నలపరెడ్డి, ఆంజనేయులు, సురేష్, లక్ష్మిరెడ్డి తదితర నాయకులతో పాటు రైతులు హనుమంత్‌రెడ్డి, కాటమయ్య, కొండారెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగేంద్రరెడ్డి, సరస్వతి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, మల్లికార్జున, మల్లేష్ కాటమయ్య, రామానాయుడు, ఆంజనేయులు, సుబ్బారెడ్డి, రఘునందన, నాగేష్, మనోహర్‌రెడ్డి, అంజన్‌రెడ్డి, పెద్ద వీరయ్య, నల్లపురెడ్డి, నాగరాజు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top