డీఎస్సీ ర్యాలీలపై పోలీసుల ఆంక్షలు

అనుమతి లేదంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు నోటీసులు

విజయవాడ: డీఎస్సీ–2025 నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చిన నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీలకు పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంటూ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఇంటికి మాచవరం పోలీసులు వెళ్లి నోటీసులు అందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ర్యాలీకి, నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి కూడా అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు.

- వైయ‌స్ఆర్‌ జిల్లాలోనూ నోటీసులు

వైయ‌స్ఆర్‌ జిల్లాలో పులివెందుల, కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టనున్న ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి కూడా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పులివెందులలో ర్యాలీని మీడియా కవర్‌ చేయవద్దంటూ పోలీసులు ప్రెస్‌నోట్‌ విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ, తాజాగా ర్యాలీలకు పిలుపునిచ్చింది. అయితే ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తమ నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
 

Back to Top