తాడేపల్లి: డీఎస్సీ–2025 పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, వీటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని వైయస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబోయే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.గత కొన్నిరోజులుగా వైయస్సార్‌సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నిజంగా భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? లోకేష్‌కు సంబంధం లేదని భావిస్తే సీబీఐ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసు నోటీసులతో ఎందుకు బెదిరిస్తోంది? ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ప్రజాస్వామ్యయుత నిరసనలను పోలీసులతో అణచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తూ మరోవైపు డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై స్వతంత్ర విచారణకు సిద్ధపడకుండా, మరోవైపు వాటిని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతి అమలుకాలేదు. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే వారి డిమాండ్‌ను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసు నోటీసులతో వారి గొంతు నొక్కాలని చూస్తోంది. ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేస్తున్నాం, పోలీసు నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. అరెస్టులు, కేసులు, బెదిరింపులతో విద్యార్థులు, యువతను అడ్డుకోలేరు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత నిర్బంధానికి పాల్పడినా ఆగస్టు 10న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుంది. విద్యార్థులు, యువత పెద్దఎత్తున ఈ కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది.