తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి దళిత, గిరిజనుల మీద నిజంగా ప్రేమ ఉంటే కొత్తగా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ స్కూల్స్ నిర్మించి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని నియమించాలని, తక్షణమే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చదువే ప్రామాణికం అని భావించి జగన్ గారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే, ఈ ప్రభుత్వం మాత్రం హాస్టళ్లను మూసివేస్తూ పేద విద్యార్థులను రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోటలోని స్కూళ్లను జీవో 144 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు కనీసం పుస్తకాలు, డ్రెస్సులు, షూలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పాయిజన్‌తో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా, పాములు కరుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు హాస్టళ్లను కనీసం సందర్శించకుండా కేవలం చంద్రబాబు దగ్గర చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. మారేడుమిల్లిలో స్కూల్ మూసివేతను అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమైన చర్య అని మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాజ్యాంగం అపహాస్యం.. చట్టాలు దుర్వినియోగం: రాష్ట్రంలో దళిత, గిరిజనుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటోంది. దళితులపై దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు కోకొల్లలుగా జరుగుతున్నా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ధంగా దళిత, గిరిజనులకు దక్కిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఈ ప్రభుత్వం తన స్వార్థం కోసం పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. దాడుల్లో గాయపడిన బాధితులపైనే తిరిగి అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై ఇన్ని దాడులు జరుగుతున్నా జాతీయ ఎస్సీ కమిషన్ కన్నెత్తి చూడకపోవడానికి కారణం.. చంద్రబాబు నాయుడు గారు వారిని కూడా మేనేజ్ చేయడమే. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల చట్టాలను వారి చుట్టాల్లా వాడుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. దాడుల్లో బాధితులైన దళిత, గిరిజనుల మీదే ఉల్టా కేసులు పెడుతున్నారు. అనాదిగా దళిత గిరిజనులకు ఉన్నటువంటి స్కూల్స్, హాస్టల్స్ మూసేస్తా ఉన్నారు. ఒక పక్క రాజ్యాంగబద్ధమైన హక్కులు కోల్పోతూనే ఉంటే, సామాజికంగా వాళ్లని బలోపేతం చేయాలనే ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్ర: ప్రపంచం మొత్తం అంబేడ్కర్ గారిని కొనియాడుతుంటే.. ఈ రాష్ట్రంలో మాత్రం అంబేడ్కర్ ఛాయలు కనిపించకూడదన్నట్టుగా ఆయన విగ్రహం పైనే దాడులు చేయిస్తున్నారు. జగన్ గారు గొప్ప ఆలోచనతో రూ. 400 కోట్లు వెచ్చించి విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెడితే ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు. నిర్వహణను గాలికొదిలేశారు. దీనిపై మేం జాతీయ ఎస్సీ కమిషన్‌కు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.. చదువుతోనే సామాజిక సమతుల్యత వస్తుందని అంబేడ్కర్ చెబితే.. ఇప్పుడు దళిత, గిరిజన విద్యార్థులు చదువుకునే స్కూల్స్, హాస్టళ్లను ఈ ప్రభుత్వం కక్షగట్టి మూసేస్తోంది. సోషల్ వెల్ఫేర్‌లో మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోటలో ఉన్న స్కూళ్లను క్లోజ్ చేసి.. ఒక్కో స్కూల్‌కి మూడు నుంచి నాలుగు కోట్లు వెచ్చించి జీవో 144 ద్వారా ప్రైవేటు వాళ్లకి ధారాదత్తం చేస్తారా? జగన్ గారి ప్రభుత్వంలో విద్యాలయాన్ని గుడిలా మార్చాం. ఇంగ్లీష్ మీడియం, ట్యాబులు ఇచ్చి డ్రాపౌట్స్ లేకుండా చేస్తే.. నేడు కనీసం పుస్తకాలు, డ్రెస్సులు, షూలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. హాస్టళ్లలో పాములు.. నిద్రపోతున్న మంత్రులు: హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేక రోజుకు 80 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురవుతున్నారు. పాములు, జెర్రులు కరుస్తున్నా మీరు పట్టించుకోరు. సోషల్ వెల్ఫేర్, గిరిజన శాఖల మంత్రులు అసలు ఉన్నారా, ఊడారా? కేవలం చంద్రబాబు దగ్గర చప్పట్లు కొట్టడానికే వీళ్లు మంత్రులయ్యారా? ఒక్కసారైనా హాస్టళ్లకు వెళ్లి పిల్లల ఆరోగ్యం గురించి అడిగారా? జగన్ గారి ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ స్కూల్ ఎలా ఉందో, ఏ హాస్టల్ ఎలా ఉందో ప్రతి వారం చార్ట్ తీసుకుని ఎంక్వైరీ చేసేవాళ్లం. తక్షణమే మూసివేతలు ఆపాలి: మారేడుమిల్లిలో స్కూల్ మూయొద్దని గొడవ చేస్తుంటే అక్కడికి వెళ్లిన మాజీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన మహిళ పుష్పశ్రీవాణి గారిని పోలీసులు ట్రీట్ చేసిన విధానం దారుణం. దళితులను చంపేసినా మీరు స్పందించరు, హాస్టళ్లు మూసేస్తుంటే పట్టించుకోరు. మీకు దళిత గిరిజనుల మీద నిజంగా ప్రేమ ఉంటే, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ స్కూల్స్ పేరిట అదనంగా కొత్త స్కూల్స్ పెట్టండి, కొత్త ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇవ్వండి. అంతేకానీ, మాకున్న గురుకులాలను, హాస్టళ్లను మూసివేసి అవకాశాలను రద్దు చేయొద్దని వైయస్ఆర్‌సీపీ తరపున నేను సూటిగా డిమాండ్ చేస్తున్నానని మేరుగు నాగార్జున అన్నారు.