పాలకొల్లు: ఆక్వా రైతులపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచడం, రూ.1.50కే విద్యుత్ అంటూ పవర్ ఫ్యాక్టర్ ఆంక్షలు విధించడం, నాసిరకం సీడ్ కారణంగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్సడా చట్టం ద్వారా ఆక్వా రంగంపై ప్రభుత్వ అజమాయిషీ కొనసాగిస్తూ రైతులకు రక్షణ కల్పించామని గుర్తుచేశారు. ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే వారి తరఫున వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం, పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావుతో కలిసి పాలకొల్లులో ముదునూరి ప్రసాదరాజు మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే.. ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు :ముదునూరి ప్రసాదరాజు. – ‘‘కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకువెళ్తోంది. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఆక్వా రంగం పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్సడా చట్టం పరిధిలో ఫీడ్, సీడ్ ధరలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చేసి ఆక్వా రైతులకు రక్షణ కల్పించాం. రైతులకు రూ.1.50కే విద్యుత్ సబ్సిడీ అందించాం. ఫిష్ ఆంధ్ర, రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ సేవలు, ఆక్వా యూనివర్సిటీ వంటి కార్యక్రమాలతో రంగాన్ని బలోపేతం చేశాం. ఇప్పుడు రైతులతో కనీసం చర్చించకుండా ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆరు నెలల వ్యవధిలోనే ఫీడ్ ధరలు రూ.15 వరకు పెరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.’’ - మాటలకే పరిమితమైన విద్యుత్ సబ్సిడీ: ‘‘రూ.1.50కే ఆక్వా చెరువులకు విద్యుత్ ఇస్తామని చెప్పి పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు పెట్టి సబ్సిడీ అందకుండా చేస్తున్నారు. రెండు జీవోలు ఇచ్చినా ఇప్పటివరకు కొత్త కనెక్షన్లకు సబ్సిడీ అమలు కాలేదు. మరోవైపు నాసిరకం సీడ్ కారణంగా రైతులు నష్టపోతున్నారు. గతంలో ప్రభుత్వ అజమాయిషీ, నాణ్యతపై పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడంతో సీడ్ హ్యాచరీలు, రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్న ఆక్వా రంగాన్ని నష్టాల ఊబిలోకి నెట్టడం న్యాయమా? ఫీడ్ కంపెనీలకు ముడిసరుకు తక్కువ ధరకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆక్వా రైతులను ఆదుకోకపోతే వైయస్‌ఆర్‌సీపీ రైతుల తరఫున ఉద్యమిస్తుంది’’ అని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో సబ్సిడీకి మోసం :వడ్డీ రఘురాం – ‘‘చంద్రబాబు నాయుడు హయాంలో ఆక్వా రైతులు తీవ్రంగా మోసపోతున్నారు. రూ.1.50కే కరెంట్ ఇస్తున్నామని చెప్పి పవర్ ఫ్యాక్టర్ పెట్టి రైతులను మోసం చేస్తున్నారు. 0.90 నుంచి 0.95 వరకు పవర్ ఫ్యాక్టర్ నిర్వహించడం ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. సబ్సిడీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిబంధన పెట్టినట్టుగా ఉంది. అప్సడా చట్టాన్ని పక్కనపెట్టి 180 జీవో తీసుకురావడంతో ఫీడ్ కంపెనీలకు ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి. పవర్ ఫ్యాక్టర్ నిబంధనను రద్దు చేయాలి. లేకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అన్ని ఆక్వా రైతు సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం.’’ ఆక్వా రైతు సంఘాలు కలిసి రావాలి :గుడాల శ్రీహరి గోపాలరావు – ‘‘కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల నడ్డి విరిచింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఫీడ్ ధరలను వరుసగా పెంచుతున్నారు. ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించి రైతులకు మేలు చేయాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.1.50కే విద్యుత్ అందించాలి. రైతుల కన్నీళ్లతో ఆక్వా రంగాన్ని నాశనం చేసే పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావద్దు. ఆక్వా రైతు సంఘాలు మాతో కలిసి రావాలి. రైతుల తరఫున పోరాటం చేయడానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. రైతులకు న్యాయం జరిగేంత వరకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం.’’