పోలవరం నాణ్యత, భద్రత గాలికొదిలేశారు

అనకాపల్లికి నీళ్ల పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ డ్రామా 

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

కాకినాడ లోని క్యాంప్‌ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

‘గలగల గోదారి’ అంటూ సినిమా ప్రమోషన్ల తరహాలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.

పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే కేంద్రం వద్ద ఎందుకు నోరుమెదపరు?

కష్టపడి ప్రాజెక్టులు కట్టింది వైయ‌స్సార్, జగన్‌ అయితే.. క్రెడిట్‌ చోరీ చేసేది చంద్రబాబునా?

అనకాపల్లికి నీళ్లిస్తున్నామని సినిమా ఫంక్షన్‌ మాదిరిగా చంద్రబాబు బిల్డప్పులు 

ఆ నీళ్లు ఎత్తిపోతల ద్వారా వచ్చినవే కానీ, పోలవరం డ్యామ్‌ నుంచి వచ్చినవి కావు

ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెట్టడానికి బనకచర్ల పేరుతో సరికొత్త స్కెచ్‌ 

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మోసాలు ఎండగట్టిన కురసాల కన్నబాబు 

కాకినాడ: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. కాకినాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు, పబ్లిసిటీ డ్రామాలకు వాడుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రతను, నాణ్యతను గాలికొదిలేశారని విదేశీ నిపుణుల కమిటీలు, సీడబ్ల్యూసీ స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. డ్యామ్‌ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించేస్తుంటే, కేంద్రం వద్ద కనీసం ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ పిచ్చితో ’గలగల గోదారి’ అంటూ సినిమా పాటలు వేసుకుని చంద్రబాబు ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కట్టే ప్రతిదీ లీకేజేనని, సచివాలయం నుంచి పోలవరం అక్విడెక్టు వరకు అంతా లీకేజీల మయంగా మారిందని దుయ్యబట్టారు. 
    రైతులను నిలువునా వెన్నుపోటు పొడుస్తున్న బాబు, అనకాపల్లి చెరుకు రైతులకు ఇవ్వాల్సిన రూ. 39 కోట్లు బకాయిలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మరోవైపు బనకచర్ల పేరుతో రూ. 86 వేల కోట్ల ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెట్టడానికి సరికొత్త స్కెచ్‌ వేశారని ఆరోపించారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు నిజమైన ఊపిరి పోశారని గుర్తు చేశారు. ఆయన కన్న కలను సాకారం చేస్తూ పోలవరం స్పిల్‌ వే పనులను, కాఫర్‌ డ్యామ్‌లను, వెలిగొండ టన్నెల్స్‌ ను వైయ‌స్‌ జగన్‌ పూర్తి చేశారని స్పష్టం చేశారు. కానీ, చంద్రబాబు మాత్రం జగన్‌ చేసిన పనులకు తాను కొబ్బరికాయలు కొడుతూ క్రెడిట్‌ దొంగిలిస్తున్నారని విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని నాడు ప్రధాని మోదీ చెప్పిన మాటలు అక్షరసత్యాలని పునరుద్ఘాటించారు. ఇలాంటి నిజాలు మాట్లాడితే రెడ్‌ బుక్‌ పేరుతో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పబ్లిసిటీ డ్రామాలు ఆపి, ప్రాజెక్టుల భద్రతపై, కరువుతో అల్లాడుతున్న రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

- అనకాపల్లికి నీళ్ల పేరుతో పచ్చి మోసం:

    పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి పంపుల ద్వారా నీళ్లు తోడి, వాటిని లిఫ్టుల ద్వారా ఎడమ కాలువలో వదిలేసి.. అవేదో పోలవరం నీళ్లు అని చంద్రబాబు ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారు. ఈ నీళ్లన్నీ కేవలం ఎత్తిపోతల ద్వారా వచ్చినవే కానీ, పోలవరం డ్యామ్‌ నుంచి వచ్చినవి కావు. కానీ మీరేదో గంగమ్మను నేలకు దించిన భగీరథుడిలా ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం ఇచ్చేసినట్టు, అనకాపల్లికి నీళ్లు ఇచ్చేసినట్టు మీకు మీరే బిల్డప్పులు ఇచ్చుకుంటున్నారు. అసలు అనకాపల్లికి, శారదానదికి పడిన గండ్లు పూడ్చడానికి మీకు దిక్కులేదు కానీ.. చిన్న కాలువల్లో నీళ్లిచ్చేసి ’మల్లన్న నుంచి సత్యదేవుని ఆశీస్సుల వరకు’ అంటూ ప్రజల కళ్లకు గంతలు కడుతూ బూటకపు జలహారతులు ఇస్తున్నారు.

- నిపుణుల కమిటీ సాక్షిగా పోలవరం భద్రత గాలికి..:
    
పోలవరం ప్రాజెక్టు భద్రతను, నాణ్యతను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ప్రాజెక్టులో నాసిరకం కాంక్రీట్‌ వాడుతున్నారని, డయాఫ్రం వాల్‌ ఎత్తు తగ్గించేశారని కేంద్ర విదేశీ నిపుణుల కమిటీ, సీడబ్ల్యూసీ తమ నివేదికలో స్పష్టంగా తేల్చినా మీరెందుకు చర్యలు తీసుకోరు? ఒక పెద్ద రిజర్వాయర్‌గా ఉండాల్సిన జీవనాడిని, మీ చేతగానితనంతో కేవలం బ్యారేజీలా మార్చేస్తున్నారు. 45.72 మీటర్లు ఉండాల్సిన డ్యామ్‌ ఎత్తును 41 మీటర్లకు కుదించేసి కేంద్రం అనుమతిస్తే మీరెందుకు కళ్లు అప్పగించి చూస్తున్నారు? ఇది తప్పని కేంద్రం దగ్గర ఎందుకు సాష్టాంగ పడరు? పోలవరంలో మీరు చేసిన ఇంజనీరింగ్‌ తప్పుల వల్లే ఈరోజు ఈ దుస్థితి దాపురించింది. నాడు సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ గారే పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని చెప్పారు. మీరు ఇప్పటికీ దాన్ని ఏటీఎం గానే చూస్తున్నారు తప్ప, చిత్తశుద్ధితో నిర్మాణం పూర్తిచేయాలన్న ధ్యాస మీకు ఏమాత్రం లేదు.

- అన్నీ లీకేజీలే.. పబ్లిసిటీ పిచ్చితో సినిమా డ్రామాలు:

    మీరు ఏ ప్రాజెక్టు కట్టినా అన్నీ లీకులే. ఆనాడు సచివాలయం కడితే లీకు, డీఎస్సీ పరీక్ష పెడితే పేపర్లు లీకు, మొన్న జలహారతి ఇచ్చిన అక్విడెక్టు కూడా జలపాతంలా కిందకు కారిపోతోంది. అసలు ప్రభుత్వం వీక్‌ అయిపోతేనే ఇలాంటి లీకేజీలు వస్తాయి. మీకు కేవలం పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. ఒక సినిమాకి ప్రమోషన్‌ ఎలా చేస్తారో, ’గలగలా గోదారి, ఉప్పొంగే గోదారి’ అంటూ పాత సినిమా పాటలు వేసుకుని ప్రజల కళ్లకు గంతలు కడుతూ డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఇలా పబ్లిసిటీ మీద దష్టి పెడితే అధికారులు కూడా అదే పంథాలో వెళ్తున్నారు. పక్కనే ఉన్న ఏలేరు కింద పంటలకు నీరు లేక రైతులు గగ్గోలు పెడుతుంటే అటువైపు చూడరు. కానీ రూ. 86 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని మీ అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రం భారీ స్కెచ్‌ వేశారు.

- క్రెడిట్‌ చోరీలో బాబు స్పెషలిస్ట్‌:

    రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటే రైతులను మీరు నిలువునా వెన్నుపోటు పొడుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే లక్షలాది ఎకరాల్లో నాట్లు పడలేదు, రైతులు విలవిలలాడుతుంటే అది మీకు పట్టదు. అనకాపల్లికి నీళ్లిస్తున్నామని బిల్డప్పులు ఇస్తూ హడావుడి చేసిన నువ్వు.. అదే అనకాపల్లిలో కష్టపడి పంట పండించి చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీకి చెరుకు తోలిన రైతులకు ఇవ్వాల్సిన 39 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు ఇప్పించలేదు? మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు 86 ప్రాజెక్టులు ప్రారంభించి రూ. 53 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు కరోనా కష్టకాలంలోనూ వెలిగొండ రెండు సొరంగాలు పూర్తి చేశారు. గండికోట, చిత్రావతి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించారు. చంద్రబాబు గారు మాత్రం ఎక్కడో మొదట్లో కొబ్బరికాయ కొట్టేయడం, ప్రాజెక్టు పూర్తయ్యాక గుమ్మడికాయ కొట్టేయడం వరకే స్పెషలిస్ట్‌. మధ్యలో కష్టపడి కట్టిన మా జగన్‌ గారి క్రెడిట్‌ ను ఆయన పచ్చిగా దొంగిలిస్తున్నారు.

- ప్రశ్నిస్తే రెడ్‌ బుక్‌ పేరుతో అక్రమ కేసులు:

    రాష్ట్రంలో ఏ చిన్న ప్రాజెక్టు అయినా అది వైయ‌స్సార్‌ ప్రస్తావన లేకుండా, జగన్‌ గారి కషి లేకుండా జరగలేదు. ఈ నిజాలను, మీ ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల ముందు పెడుతుంటే మీకు వణుకు పుడుతోంది. మా దగ్గర ఒక రెడ్‌ బుక్‌ ఉంది అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను బూతులు తిట్టడం, ప్రశ్నించే గొంతులను అణచివేయడం, హౌస్‌ అరెస్టులు చేయడం, అక్రమ కేసులు బనాయించడమే మీ అజెండాగా మారింది. నేను సూటిగా డిమాండ్‌ చేస్తున్నాను.. అబద్ధాలకు నిజాల కోటింగ్‌ వేయడం మానేసి, ముందు పోలవరం భద్రత మీద, భూసేకరణ మీద దష్టి పెట్టండి. మీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ పక్కనపెట్టి రైతాంగం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నబాబు డిమాండ్‌ చేశారు.

Back to Top