‘టెట్‌’ క్వాలిఫై కాకపోయినా డీఎస్సీ ఉద్యోగాలు 

ఒక్కో టీచర్‌ ఉద్యోగానికి లక్షల్లో బేరసారాలు

ఎమ్మెల్సీ లేళ అప్పిరెడ్డి ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్‌ బాధ్యత వహించాలి

తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి

డీఎస్సీ–2025 నియామకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి

:ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌

డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా పేరిట కార్యకర్తలకు పోస్టుల పందేరం

వాటిపై ఆధారాలున్నాయి. అయినా బుకాయిస్తున్న ప్రభుత్వం

:ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన భారీ కుంభకోణం, అక్రమాలపై అడ్డంగా దొరికిపోయినా సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నిర్లజ్జగా బుకాయిస్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా ముంచి, దాన్ని  ‘దగా డీఎస్సీ’గా మార్చారని, స్పోర్ట్స్‌ కోటా పేరుతో, కనీసం టెట్‌ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారని, అలా టీచర్‌ పోస్టులను టీడీపీ కార్యకర్తలకు, లోకేష్‌ పాదయాత్రలో నడిచిన వారికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. వాటిని ఆధారాలతో సహా నిరూపించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి కనీస పశ్చాత్తాపం లేదని ఆక్షేపించారు. 
    3.30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకున్న ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహించి, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఈ డీఎస్సీ నియామకాలపై దమ్ముంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

టెట్‌ అర్హత లేకున్నా ఉద్యోగాలు:
    కర్నూలులో ప్రభాకర్‌ అనే అభ్యర్థి టెట్‌ క్వాలిఫై కాకుండానే ఉద్యోగం పొందిన వైనం మీ గెజిట్‌ పత్రిక ఈనాడులోనే వచ్చింది. కర్నూలులోనే 14 ఏళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా చేరిన అన్నది ఒక కులం, ఇప్పుడు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందిన తమ్ముడిది మరో కులంగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. కనీస కటాఫ్‌ మార్కులు లేని వారికి కూడా పోస్టులు ఇచ్చేశారు.
    తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్‌ రాస్తే సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఇచ్చారు. చిత్తూరులో టెట్‌  పరీక్షలో కనీస అర్హతగా.. 90 మార్కులు రావాల్సిన ఓసీ అభ్యర్థికి 79 మార్కులు వచ్చినా ఉద్యోగం కట్టబెట్టారు. 2005లో కబడ్డీ ఆడితే, 2024లో ఖోఖో ఆడినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారు. అసోసియేషన్‌ సెక్రటరీ సంతకం ఉండాల్సిన చోట టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సంతకం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చారు. అలాంటి వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారు. 

స్పోర్ట్స్‌ కోటా పేరిట జీవోలతో మాయాజాలం:
    2012 నాటి జీవో నెం.74 ప్రకారం ఉన్న 2 శాతం స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచారు. ఆ తర్వాత నియామకాల్లో పలు మార్పులు చేస్తూ కొత్తగా జీఓలు నెం:4, 47 తీసుకొచ్చారు. ఇది నిజమా? కాదా?
    కనీసం టెట్‌ కూడా క్వాలిఫై కాకపోయినా, మీకు కావాల్సిన వారికి, మీ కార్యకర్తలకు డీఎస్సీ ఎగ్జామ్‌ రాయకుండానే దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టిన తర్వాత, మళ్లీ ఆ జీవోలను రద్దు చేస్తూ జీవో నెం:56 ఇచ్చి పాత పద్ధతి తెచ్చింది వాస్తవం కాదా? ఒక్కో టీచర్‌ ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారు. ప్రకాశం జిల్లాలో డబ్బులు ఇచ్చి ఉద్యోగం రాలేదని ఒక మహిళ స్వయంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రపంచ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన క్రీడాకారుడు దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వకుండా అర్హత లేని వారికి ఎలా కట్టబెట్టారు?.

నిబంధనల ఉల్లంఘన – ఎస్సీఈఆర్టీ అక్రమాలు:
    పరీక్ష పత్రాల తయారీకి సంబంధించి డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు మొత్తం పెత్తనం అప్పగించిన మాట వాస్తవం కాదా? ఎస్సీఈఆర్టీలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేసిన నవీన్‌ అనే వ్యక్తికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది నిజం కాదా? ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి నిజం కాదా? అధికారులు ఒక మాట, మంత్రి లోకేష్‌ మరో మాట మాట్లాడుతూ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?

పేకాట, ఐస్‌ బాస్కెట్‌బాల్‌ సర్టిఫికెట్లతో కొలువులా!:
    రాష్ట్రంలో ఎక్కడా ఆడని క్రీడల పేరిట బోగస్‌ సర్టిఫికెట్లు సృష్టించారు. ఐస్‌ బాస్కెట్‌బాల్, చిత్తూరులో బోట్‌ సెయిలింగ్‌ అంటూ లేని ఆటల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చారు. చివరకు బ్రిడ్జ్‌ గేమ్‌ (పేకాట) కూడా చేర్చారు. నలుగురు కూర్చుని పేకలు ఆడే ఆటకు సర్టిఫికెట్‌ తెచ్చిన వ్యక్తి బడికి వెళ్లి విద్యార్థులకు ఏం పాఠాలు చెబుతాడు? పేకాట నేర్పిస్తాడా? పక్క రాష్ట్రాల ప్రజలు చూసి నవ్వుతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా?.

సర్కారు బడుల నిర్వీర్యం – కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము:
    జగన్‌గారు తన హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తే, ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పేదలు చదివే ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తోంది. కార్పొరేట్‌ విద్యా సంస్థల ప్రయోజనాల కోసం కనీసం క్వాలిఫై కూడా కాని వారిని టీచర్లుగా పంపుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. గురు పూజోత్సవం వేళ ఉపాధ్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బ తీస్తున్నారు.

శాసన మండలిలో చర్చకు రాలేక పారిపోయిన ప్రభుత్వం:
    రాష్ట్రంలో 3.30 లక్షల నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని నాలుగు రోజుల పాటు శాసన మండలిలో మేము పట్టుబడితే, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మండలికి వచ్చి కూడా సమాధానం చెప్పలేక పారిపోయారు. శాసనసభకు, శాసన మండలికి మధ్య కేవలం నాలుగు అడుగుల దూరమే ఉంది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు లేరని, అడిగే వారు ఎవరూ ఉండరనే ధైర్యంతో అసెంబ్లీని వేదికగా చేసుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. బయట తాడేపల్లిలో సవాళ్లు విసరడం కాదు, మండలిలో మేము ఉన్నాం. పరీక్ష పత్రాల తయారీ నుంచి మెరిట్‌ లిస్టులు, నియామకాల వరకు జరిగిన ప్రతీ అంశంపై చర్చించే దమ్ముందా అని అడిగితే తండ్రీకొడుకులిద్దరూ ముఖం చాటేశారు.

సీబీఐ విచారణ జరిపించాలి – మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి:
    దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన ఈ డీఎస్సీపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించడంతో పాటు, ఈ పరీక్షలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో అన్యాయానికి గురైన నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top