మళ్లీ జగన్ సీఎం అయితేనే గిరిజనులకు మంచి రోజులు

గిరిజనుల ఆత్మగౌరవం కాపాడింది జగనే

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే గిరిజనులకు పెద్దపీట

పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు (మైదాన ప్రాంతం) గుండా సురేంద్ర స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కూటమి ప్రభుత్వం గిరిజనులకు వెన్నుపోటు పొడిచింది

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసగించింది

రాబోయే రోజుల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి గ‌ట్టిగా బుద్ధిచెబుతాం

గిరిజన నాయకుల తీర్మానం 

తాడేపల్లి: మళ్లీ జగన్ సీఎం అయితేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని, గత వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే సంక్షేమం, రాజకీయంగా గిరిజనులకు పెద్ద పీట వేశారని గిరిజన నాయకులు గుర్తు చేశారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను మళ్ళీ సీఎం చేయడానికి గిరిజనులు అందరూ ఏకం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో నాయకులు పిలుపునిచ్చారు. ముందుగా గిరిజన సాంప్రదాయ నృత్యాలు, పాటలతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు (మైదాన ప్రాంతం) గుండా సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లేళ్ల అప్పిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను గిరిజన నాయకులు వారి సాంప్రదాయంలో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు సీఈసీ సభ్యులు శేషగిరిరావు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గిరిజన సమరయోధులకు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండా సురేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వారి కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు. గిరిజ‌న బిడ్డ‌ల విద్య‌, వైద్యం కోసం త‌న ఐదేళ్ల పాల‌న‌లో వైఎస్ జ‌గ‌న్ గారు ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చార‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. 

జ‌గ‌న్ పాల‌న‌లోనే గిరిజనుల‌కు మేలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి హయాంలో గిరిజన సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టినట్లు గుండా సురేంద్ర తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. అదేవిధంగా 157 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించారని, సుమారు 1,70,000 మందికి 3,20,000 ఎకరాల ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు, 25,300 మందికి 38,200 ఎకరాల డీకేటీ పట్టాలు అందించినట్లు వివరించారు. దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, కురుపాంలో రూ.153 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారని, ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాలూరులో 561 ఎకరాల్లో ఏపీ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. జగన్  ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా సుమారు రూ.19,471 కోట్ల నిధులు గిరిజనుల ఖాతాల్లో జమ చేసినట్లు గుండా సురేంద్ర పేర్కొన్నారు.

వెన్నుపోటు కూట‌మి పాల‌న‌లో గిరిజ‌నుల‌కు అన్యాయం 

గత ప్రభుత్వాల హయాంలో గిరిజనుల సమస్యలు, హక్కుల పట్ల నిర్లక్ష్యం జరిగిందని రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస నాయక్ విమర్శించారు. గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం, టీఏసీ ఏర్పాటు చేయకపోవడం, జీవో నెంబర్ 3 విషయంలో హామీలను అమలు చేయకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన అనంతరం అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, అప్పటి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి నేతృత్వంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఐటీడీఏల ఏర్పాటు, గిరిజన హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై భవిష్యత్తులో కృషి చేయాల్సిన అవసరం ఉందని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెంకటసుబ్బయ్య తెలిపారు. మైదాన ప్రాంతంలో ఐటీడీఏల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. 1/70 చట్టం అమలు వంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటే రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గిరిజన విభాగం ఉపాధ్యక్షుడు ఎన్. గోవింద నాయక్, రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస నాయక్, రాష్ట్ర ఎస్టీ విభాగం నాయకుడు శేషయ్య, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెంకటసుబ్బయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎరుకలి రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భూక్యా శ్రీను, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగనాయక్, బాపట్ల జిల్లా నాయకుడు మిగిలి నాగేశ్వరరావు, గుంటూరు ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేడ వెంకటేశ్వరరావు, రాష్ట్ర గిరిజన నాయకులు ఇట్టా బాబూరావు, రమేష్, అశోక్, శివతో పాటు పలువురు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Back to Top