తాడేపల్లి: ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి గారి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని వైయస్ జగన్ గుర్తుచేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించడంతో పాటు, అనంతరం తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్ జగన్ పేర్కొన్నారు. షావుకారు జానకి గారి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతిని శ్రీ వైయస్ జగన్ తెలిపారు.