కృష్ణాజిల్లా: ఉయ్యూరులో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరోచనాలతో 15 మందికి పైగా ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా, మరికొందరు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా బారినపడిన 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో షేక్ నూరుద్దీన్ మృతి చెందారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పెనమలూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి పరామర్శించారు. అనంతరం కలుషితమైన నీరు సరఫరా అవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అన్నారు. భూమి నుంచి నేరుగా మంచినీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారని, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో నీటిని క్లోరినేషన్ చేసే పరిస్థితి కూడా లేదని తెలిపారు. మంచినీటిలో డ్రైనేజీ నీరు కలవడం వల్లే కలుషితం జరిగిందని పేర్కొన్నారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కలుషిత నీటి సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.