శ్రీశైలంలో నీరు ఉన్నా రైతుల పొలాలకు ఎందుకు ఇవ్వడం లేదు? 

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి  సూటి ప్ర‌శ్న‌

నంద్యాల జిల్లా: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ రైతులకు ఉపయోగపడని పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్‌ను కూడా ప్రభుత్వం నింపే పరిస్థితి లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చంద్రబాబు నాయుడు చేసుకున్న చీకటి ఒప్పందాల కారణంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ఎరువులు కూడా సకాలంలో అందడం లేదని తెలిపారు.

రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు. రైతులు పంటలు వేయకుండా ప్రభుత్వం చెప్పే పరిస్థితి ఎన్నడూ లేదని, ఇప్పుడు రైతులను ఎలా ఆదుకుంటుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని అన్నారు. శ్రీశైలం జలాశయంలో ఉన్న నీటిని రైతుల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు నీరు అందించకపోతే రైతులతో కలిసి వెళ్లి నీటిని తెచ్చుకుంటామని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top