గుంటూరు: శ్రావణమాసంలో పెదకాకాని శివాలయంలోని భ్రమరాంబ అమ్మవారి మెడలోని మంగళసూత్రం మాయం కావడం దారుణమని వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ ఈ ఘటనపై పలు ప్రశ్నలు సంధించారు. భ్రమరాంబ అమ్మవారి మెడలోని మంగళసూత్రం మాయమై నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు ఎందుకు స్పందించలేదు? వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయలేదు?. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకుని ఆభరణాలను అప్పగించారు. మరి అమ్మవారి మంగళసూత్రం మాయమైనప్పుడు అదే వేగం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు మౌనం? అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించడం లేదు? ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉందని గుర్తు చేశారు. పెదకాకాని శివాలయంలో గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగినట్లు సమాచారం ఉంది. గతంలో పెట్టిన ఆభరణాల విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి వాస్తవికతపై స్పష్టత రావాలన్నారు. శివాలయంలో ఉన్న ఆభరణాలన్నింటినీ కంచి కామకోటి పీఠాధిపతితో పరిశీలింపజేసి వాటి వాస్తవికత, వివరాలపై స్పష్టత తీసుకురావాలి. ఆలయ ఆభరణాల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. అమ్మవారి ఆభరణాలను అపహరించిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి. ఈ ఘటనపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఆలయ ఆభరణాల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అంబటి మురళికృష్ణ డిమాండ్ చేశారు.