తిరుపతి: రాష్ట్రంలోని మత్స్యకారుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ప్రతి రెండు, మూడు నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇటీవల అంబేద్కర్, కోనసీమకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఆగస్టులో సముద్రంలోకి వెళ్లగా, మధ్యలో బోటు మరమ్మతుకు గురై బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోయిందని తెలిపారు. దాదాపు 24 రోజుల పాటు సముద్రంలో చావుబతుకుల మధ్య నరకయాతన అనుభవించిన మత్స్యకారులు చివరకు పశ్చిమ బెంగాల్ సమీపంలో కనిపించడంతో అక్కడి మత్స్యకారులు వారిని ఒడ్డుకు చేర్చారని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్‌గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు. వైయస్ జగన్ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు చేపట్టిందని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల భద్రతకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేదని, బోట్లకు నావిగేషన్ సదుపాయాలు కల్పించలేదని గురుమూర్తి అన్నారు. సముద్రంలో ప్రమాదాలు ఎదురైనప్పుడు తమ ఆచూకీని గుర్తించేందుకు మత్స్యకారులకు శాటిలైట్ ఫోన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో పట్టుబడుతున్న మత్స్యకారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు అధికంగా ఉన్నప్పటికీ వారికి సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టామని, నూతన బోట్లు అందించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గురుమూర్తి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. బోట్లకు నావిగేషన్ వ్యవస్థ, పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయడంతో పాటు మత్స్యకారులకు సముద్ర భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని గురుమూర్తి స్పష్టం చేశారు. మత్స్యకారులు మరోసారి 24 రోజుల పాటు నరకయాతన అనుభవించే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.