తిరుపతి: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో, రారో అన్న దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొందని, 900 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో మత్స్యకారుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. తిరుపతిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెన్నుపోటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి 24 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుమిట్టాడిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్. జగన్ గారి చొరవ, కేంద్రంపై వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన ఒత్తిడే కారణమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి, విదేశీ ఎంబసీలకు, కోస్ట్ గార్డ్ అధికారులకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి మత్స్యకార బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, శాటిలైట్ ఫోన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బోట్లలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పాండర్లలో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. నావిగేషన్ పరికరాలు 24 గంటలూ పనిచేసేలా సోలార్ పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బోటుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, లైఫ్ జాకెట్లు, అవసరమైన భద్రతా పరికరాలు అందించాలని సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - 24 రోజుల నరకయాతన.. ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. మార్గమధ్యంలో బోటు మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు కొట్టుకుపోయింది. దాదాపు 24 రోజుల పాటు సముద్రంలో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అత్యంత దయనీయ పరిస్థితుల్లో వారు ప్రాణాలతో పోరాడారు. అదృష్టవశాత్తూ పశ్చిమ బెంగాల్ జాలర్ల కంటపడటంతో.. ఆ జాలర్లు వీరి బోటును తాడుతో కట్టి దిఘా తీరానికి చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. - రంగంలోకి వైయస్సార్‌సీపీ.. కేంద్రం, ఎంబసీలతో నిరంతర సమన్వయం మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే వైయస్ జగన్ గారి ఆదేశాలతో వైయస్సార్సీపీ యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌లకు లేఖలు రాసి పరిస్థితి తీవ్రతను వివరించాం. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ ఎంబసీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నాం. పార్టీ నేత వాసుపల్లి జానకిరామ్, కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్స్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండి గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా కృషి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి, విదేశీ ఎంబసీలకు, కోస్ట్ గార్డ్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. - కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ? 900 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో మత్స్యకారుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం బోట్లకు కనీస 'సేఫ్టీ ఆడిట్' నిర్వహించడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు శాటిలైట్ ఫోన్లు ఇస్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? బోట్లలోని ట్రాన్స్‌పాండర్లలో సాంకేతిక లోపాలు ఉన్నా, నావిగేషన్ పరికరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మత్స్యకారుల రక్షణ కల్పించడంలో ఫిషరీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోంశాఖలు ఘోరంగా విఫలమయ్యాయి. - మత్స్యకారులకు అండగా నిలిచింది జగన్ ప్రభుత్వమే.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడంతో పాటు, వేట నిషేధ సమయంలో 'మత్స్యకార భరోసా' ఇచ్చి ఆదుకున్నాం. వారికి డీప్ సీ ఫిషింగ్ బోట్లు ఇవ్వడానికి ఎఫ్‌పీఓల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఫైళ్లన్నీ అటకెక్కించారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, చిత్తశుద్ధితో మత్స్యకారుల ప్రాణాల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. తక్షణమే మత్స్యకారులకు శాటిలైట్ ఫోన్లు, 24 గంటలు పనిచేసేలా పవర్ బ్యాకప్ (సోలార్ ప్యానెల్స్) తో కూడిన నావిగేషన్ పరికరాలు అందించాలని వైఎస్సార్సీపీ పక్షాన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.