విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ధరలను ఓ వైపు పెంచుకుపోతూ, మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా కోతలు విధిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలంటూ వైయస్ఆర్ సీపీనేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్, మల్లాది విష్ణుతో పాటుగా ఇతర నేతలు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలను నియంత్రించడంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారిచండం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బియ్యం, పప్పుదినెసలు, నూనెలు, చక్కెర వంటి నిత్యావసర ఉత్పత్తుల ధరల బహిరంగ మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయాయని, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం నాటి ధరలకు ఇప్పటి ధరలకు దాదాపుగా రెట్టింపు రేట్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు కొనలేక, తినలేక అల్లాడిపోతుంటే, చంద్రబాబు మాత్రం కుల, మత రాజకీయాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసి ధరలను అదుపు చేసి సామాన్యులకు అందుబాటులో నిత్యవసరాలను ఉంచకపోతే ఎన్టీఆర్ జిల్లా నుంచే వైయస్ఆర్‌సీపీ పోరాటం చేపడుతుందని హెచ్చరించారు. అప్పుడు బాదుడే.. బాదుడే అన్నారు.. మరి దీన్నేమంటారు బాబు..? ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో ఆర్థికంగా భారం పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ అంటూ ఊరూవాడా ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే బాదుడును ప్రజలపై మోపుతున్నారు. ప్రజలకు అందాల్సిన బియ్యం, పప్పులు, నూనెలు తదితర నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ స్టోర్లలో సరుకులు అందుబాటులో ఉంచడంతో పాటు రైతు బజార్ల ద్వారా కూడా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించాలనే జ్జానం కూడా కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సందర్భాల్లో రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరలకు సరుకులు అందించిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు తనను తాను సీనియర్ ముఖ్యమంత్రిగా చెప్పుకోవడం కాదు. ఆ సీనియారిటీతో ప్రజలకు ఏం ప్రయోజనం కలిగిందో చెప్పాలి. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే భారీగా అప్పులు చేస్తోంది. ప్రజలపై ధరల భారం తగ్గించాలి. నిత్యావసర వస్తువులను ప్రభుత్వ స్టోర్లు, రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు అందించాలి. ప్రజల కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలి. లేదంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. యువగళంలో లోకేశ్ చెప్పినట్లు.. మహిళలు చొక్క పట్టుకుని నిలదీస్తారు - దేవినేని అవినాశ్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధరల నియంత్రణ చేయకపోతే చొక్క పట్టుకుని అడగమని సవాల్ విసిరారు. మరి ఇప్పుడు లోకేశ్ రోడ్డు మీద కనిపిస్తే చొక్కా పట్టుకుని నిలదీయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. అప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి విమర్శలు చేసిన కూటమి నేతలు, ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలకు ఏం సమాధానం చెబుతారు. జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని హామీ ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు పొందిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయలేకపోవడంపై సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ప్రజల సంక్షేమాన్ని, పాలనను గాలికి వదిలేసి వైయస్ఆర్‌సీపీ నేతల కుల, మతాలను, కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం దారుణం. ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను కులాలు, మతాలు, ప్రాంతాలతో ముడిపెట్టి రాజకీయంగా ఉపయోగించడం చంద్రబాబుకు కొత్త కాదు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. నిత్యావసర ధరలు తగ్గించకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం - మల్లాది విష్ణు రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఈ ఈ భారాన్ని ఎక్కువగా మోస్తున్నది మహిళలే. కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తారుమారైంది. అందుకే ప్రజల తరఫున జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. 2024లో కిలో పంచదార సుమారు రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.75కు, బియ్యం రూ.40 నుంచి రూ.65కు, కందిపప్పు రూ.100 నుంచి రూ.160కు పెరిగింది. ఉల్లి, వంటనూనెతో పాటు అనేక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగినా, , ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిత్యావసర సరరుకులు 2024లో ఎంత ఉంది? 2025లో ఎంత ఉంది? 2026 ఆగస్టు 29న ఎంత ఉంది? ఈ మూడు ధరలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి. ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుందో చెప్పాలి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలపై పడుతున్న ధరల భారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి డాష్‌బోర్డులో నిత్యావసర సరుకుల ధరలు డ్యాష్ బోర్డులో ప్రతిరోజూ కనిపిస్తున్నా, ధరలను తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సీఎం స్థాయిలో ఏ రోజైనా ఓ సమీక్ష కూడా చేయలేదు. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు వంటి సరుకులు సరసమైన ధరలకు ఎందుకు అందుబాటులో లేవు? మార్కెట్‌లో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు జరుగుతున్నా అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను అరికట్టలేకపోతున్నారు. రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండగలు ఉన్న సమయంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పండగల సమయంలో ప్రతి ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అలాంటి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపడం దారుణం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలకు పాల్పడుతోంది. ప్రజల సమస్యలపై మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. మాపై బురదజల్లడం కాదు. ధరలు ఎందుకు పెరిగాయో, వాటిని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, మహిళా సంక్షేమం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రజారోగ్యం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించడంతో పాటుగా బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకు సామాన్యులకు సరుకులు అందించాల్సిందే. లేకుంటే ఎన్టీఆర్ జిల్లా నుంచే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడతాం.