పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

బరితెగించిన ‘క్రెడిట్ చోరీ’!

స్పష్టం చేసిన వైయస్ఆర్‌సీపీ  ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్. 

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్.

వెలిగొండ ప్రాజెక్టు82.2% పనులు పూర్తి చేసింది వైయ‌స్ఆర్‌, జగన్‌లే..

దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా?: 

కాకమాను రాజశేఖర్ సవాల్.

తాడేపల్లి: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్ ధ్వజమెత్తారు.  తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వెలిగొండ ప్రాజెక్టులో 82.2 శాతం కీలక పనులను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేస్తే.. ఏమీ చేయని చంద్రబాబు అంతా తానే చేసినట్లు డబ్బా కొట్టుకుంటూ దిగజారుడు ‘క్రెడిట్ చోరీ’ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఈ సందర్భంగా ఇంకా కాకమాను రాజశేఖర్ ఏమన్నారంటే... 

ఎవరో కష్టపడితే తన ఖాతాలో వేసుకోవడం బాబు నైజం..

చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం. నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కుని తానే వ్యవస్థాపకుడినని చెప్పుకున్నట్టే.. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని తానే కట్టానని, అసలు హైదరాబాదునే తానే నిర్మించానని ప్రచారం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు వేసిన శిలాఫలకాలు సమాధి రాళ్లుగా మిగిలిపోయాయే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టూ ఆయన హయాంలో పూర్తి కాలేదు. దేవాదుల ప్రాజెక్టు కోసం హెలికాప్టర్‌లో బేల్దారీని, సిమెంటును తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకున్న చరిత్ర ఆయనది.

మార్కాపురం కమ్యూనిస్ట్ యోధుడు పూల సుబ్బయ్య పేరు కూడా పలకరా?

వెలిగొండ ప్రాజెక్టు కోసం నాడు అలుపెరగని పోరాటం చేసిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత పూల సుబ్బయ్య గారి పేరును పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టుకు పెట్టింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. కానీ నేడు చంద్రబాబు కనీసం పూల సుబ్బయ్య పేరు కూడా ఉచ్చరించకుండా చరిత్రను చెరిపేయాలని చూస్తున్నారు. 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. 2004 వరకు ఎనిమిదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలు మాత్రమే. ఆ నిధులు కూడా శిలాఫలకం, సభ ఏర్పాట్లకే సరిపోయాయి తప్ప ఒక్క కిలోమీటరు సొరంగం కూడా తవ్వలేదు.

వెలిగొండకు సమగ్ర రూపం ఇచ్చింది వైయ‌స్ఆర్‌ కాదా?

2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్సార్  జలయజ్ఞం కింద వెలిగొండ ప్రాజెక్టుకు సరికొత్త డీపీఆర్ రూపొందించారు. ఒక టన్నెల్ స్థానంలో జంట సొరంగాలు, నల్లమల సాగర్ పరిధిలోని మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్స్, ప్రధాన కాలువలతో సమగ్ర రూపునిచ్చి కాగితాల నుంచి ప్రాజెక్టును క్షేత్రస్థాయికి తెచ్చారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో పనులను పరుగులు పెట్టించారు. 2004 నుంచి 2014 మధ్య వైఎస్సార్ హయాంలో రెండు సొరంగాల్లో కలిపి ఏకంగా 20.33 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది.

చంద్రబాబు నత్తనడక.. జగన్ హయాంలో రికార్డు వేగం..

2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో తవ్వించింది కేవలం 6.68 కిలోమీటర్లు మాత్రమే. 2017, 2018, 2019 అంటూ ఏటా డెడ్‌లైన్లు మార్చారే తప్ప ఒక్క టన్నెల్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు.
టన్నెల్-1: చంద్రబాబు పాలనలో రోజుకు సగటున 2.41 మీటర్ల పని జరిగితే.. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 4.12 మీటర్ల వేగంతో పనులు జరిగాయి. కరోనా వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ మిగిలిన 2.88 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేసి 2021 జనవరి 13న టన్నెల్-1 బ్రేక్ సాధించారు.

టన్నెల్-2: బాబు హయాంలో రోజుకు కేవలం 1.31 మీటర్ల పని జరిగితే.. వైయస్.జగన్ హయాంలో టీబీఎం, మాన్యువల్ పద్ధతుల్లో రోజుకు రికార్డు స్థాయిలో 7.25 మీటర్ల వేగంతో తవ్వకం సాగింది.
2019-24 మధ్య జగన్ ప్రభుత్వం అత్యంత క్లిష్టమైన 10.56 కిలోమీటర్ల టన్నెల్ పనులతో పాటు హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తి చేసి 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేసింది.

82.2% వైఎస్సార్, జగన్ చేస్తే.. 17.8% చేసిన బాబు డబ్బా కొట్టుకుంటారా?

మొత్తం 37.587 కిలోమీటర్ల సొరంగం తవ్వకంలో వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు పూర్తి చేసినది 30.901 కిలోమీటర్లు (82.2 శాతం). చంద్రబాబు ఐదేళ్లలో చేసింది కేవలం 6.68 కిలోమీటర్లు (17.8 శాతం) మాత్రమే. వైయస్. జగన్ పూర్తి చేసిన సొరంగాల వద్ద ఇప్పుడు చంద్రబాబు ఫోటోలు దిగి ప్రాజెక్టు మొత్తం తానే పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.

ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?

చంద్రబాబుకు దమ్ముంటే ఈ మూడు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. టన్నెల్-1 బ్రేక్ త్రూ ఎవరి హయాంలో జరిగింది?  టన్నెల్-2 బ్రేక్ త్రూ ఎవరి హయాంలో జరిగింది? జంట సొరంగాల పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేసింది ఎవరు? సమాధానం చెప్పాలి.

నిర్వాసితుల ఉసురు పోసుకుంటున్న కూటమి ప్రభుత్వం.

జగన్ ప్రభుత్వం జంట సొరంగాలను సిద్ధం చేసి అందిస్తే.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నిర్వాసితులకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పునరావాసం (R&R ప్యాకేజీ) ఎందుకు కల్పించలేదు? నల్లమల సాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు? కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినా వెలిగొండకు నీటిని మళ్లించకుండా రైతాంగానికి రెండేళ్లుగా తీరని అన్యాయం చేస్తున్నారు. మార్కాపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు ముందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందక ఓ నిర్వాసితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.

రికార్డులతో సహా చర్చకు సిద్ధం.. చంద్రబాబుకు దమ్ముందా?

ఈ నేపధ్యంలో వెలిగొండ విషయంలో చరిత్ర చాలా స్పష్టంగా ఉందని కాకమాను రాజశేఖర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు కేవలం చంద్రబాబు శంకుస్థాపన రాయి  వేస్తే... దానికి సమగ్ర రూపునిచ్చి సాకారం చేసింది వైఎస్సార్.. సంపూర్ణంగా సొరంగాలు నిర్మించింది వైఎస్ జగన్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుపై ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో, ఎవరు ఎంత ఖర్చు చేశారో అధికారిక రికార్డులు ఉన్నాయిన్న ఆయన... దమ్ము, ధైర్యం ఉంటే ఆ రికార్డులతో వెలిగొండ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు.

Back to Top