తాడేపల్లి: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడి బతుకు భారంగా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలను నియంత్రించి పేదలకు అండగా నిలబడ్డంతో పాటు, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను సైతం ఆదుకున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఒకవైపు రైతులను గాలికొదిలేయడంతో పాటు, మరోవైపు నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలమై ప్రజల నడ్డి విరుస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..: కరవు–చంద్రబాబు కవల పిల్లలు: చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది. చంద్రబాబు చుట్టూ ఉండే కోటరి, ఆయన బినామీలు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి నీరు ఇవ్వలేక రాష్ట్రంలో కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. మిగతా 75 శాతం ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడిపోతున్నారు. రైతులతో పాటు మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి పరిస్థితి దయనీయంగా మారింది. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్న గృహిణులు: నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సగటు జీవి బడ్జెట్ తలకిందులైంది. నెలవారీ సంపాదనలో 40 నుంచి 50 శాతం కేవలం నిత్యావసరాలకే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. వంటింట్లో వంట చేయాలంటే ఉల్లిపాయ పట్టుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి, నూనె డబ్బా వైపు చూడాలంటే భయమేస్తోంది. పంచదార: గతంలో వైయస్ జగన్ హయాంలో కేజీ రూ.35 నుంచి రూ.40 ఉంటే, నేడు ఏకంగా రూ.75కి చేరింది (దాదాపు 100% పెంపు). బియ్యం: నాడు రూ.40 ఉన్న సాధారణ బియ్యం నేడు రూ.65 అయ్యాయి. సూపర్ ఫైన్ బియ్యం రూ.48 నుంచి రూ.75కి పెరిగింది. పప్పు దినుసులు: మా పాలనలో రూ.100–105 ఉన్న కందిపప్పు, మినప్పప్పు ధరలు నేడు రూ.160కి చేరాయి. శనగపప్పు రూ.70 నుంచి రూ.95కి పెరిగింది. ఉల్లిపాయలు. మిర్చి: రూ.18 ఉన్న ఉల్లిగడ్డల ధర రూ.70కి చేరింది. రూ.120 ఉన్న ఎండుమిర్చి ఏకంగా రూ.390కి పెరిగింది. రూ.10 ప్యాకెట్ ఉప్పు కూడా నేడు రూ.30 అయింది. 100% నూనె ధరలు పెంచినందుకు చంద్రబాబును ఏ నూనెలో వేయాలి?: గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నీచమైన మాటలు మాట్లాడారు. నూనె ధరలు పెరిగాయని, నాటి సీఎం వైయస్ జగన్ >రిని సలసల కాగే నూనెలో వేయాలంటూ విషం చిమ్మారు. మరి ఈరోజు ఆయన పాలనలో నూనె ధరలు ఎలా ఉన్నాయో చూశారా? పామాయిల్ మా హయాంలో లీటరు రూ.80 ఉంటే.. నేడు రూ.154 నుంచి రూ.160కి చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.90 నుంచి నేడు రూ.192కి ఎగబాకింది. వేరుశనగ నూనె రూ.140 నుంచి రూ.215కి, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.100 నుంచి రూ.163కి పెరిగింది. దాదాపు 100 శాతం నూనె ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్న చంద్రబాబును ఇప్పుడు ఏ సలసల కాగే నూనెలో వేయాలో ఆయనే సమాధానం చెప్పాలి. కరెంటు బిల్లులు.. గ్యాస్.. మద్యం అంతా బాదుడే బాదుడు: సామాన్యుడిపై అన్ని రంగాల్లోనూ బాదుడే బాదుడు సాగుతోంది. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో నిత్యావసర ధరలను అదుపులో ఉంచితే.. ఈ ఆరు నెలల కాలంలోనే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.20 నుంచి రూ.100 వరకు పెంచేశారు. మద్యం క్వార్టర్ సీసాపై రూ.10 నుంచి రూ.40 వరకు పెంచి బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. గతంలో రూ.300 వచ్చిన విద్యుత్ బిల్లు నేడు రూ.1500 నుంచి రూ.2000 వరకు, కొన్ని చోట్ల రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వస్తోంది. మార్కెట్ జోక్యం ఎక్కడ? ధరల స్థిరీకరణ ఏమైంది?: గతంలో కరోనా వంటి తీవ్ర విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ వైయస్. జగన్ ప్రభుత్వం నిత్యావసర ధరలను కంట్రోల్‌లో ఉంచింది. పౌరసరఫరాల శాఖ ద్వారా మార్కెట్‌లో జోక్యం చేసుకుని రాయితీపై నిత్యావసరాలను అందించాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. మద్దతు ధర లేక రైతులు టమోటాలు, మిర్చి, కూరగాయలను రోడ్లపై పారబోసుకుంటున్నారు. ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖతో ఒక్క సమీక్ష కూడా నిర్వహించకుండా.. కేబినెట్ హోదాలు, పదవుల పంపకాలు, జగన్ గారిపై విమర్శలు చేయడానికే మంత్రులు పరిమితమయ్యారు. ధరలు తగ్గించకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం తప్పదు: కూటమి ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల పేదవాడు మూడు పూటలా కడుపునిండా అన్నం తినలేని దుస్థితి ఏర్పడింది. పేద, మధ్య తరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తూ బినామీలకు మేలు చేసే విధానాలను తక్షణమే మానుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి పౌరసరఫరాల శాఖ ద్వారా మార్కెట్‌లో జోక్యం చేసుకుని, సబ్సిడీపై నిత్యావసరాలు అందించి ధరలను అదుపులోకి తీసుకురావాలని. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని పుత్తా శివశంకర్ హెచ్చరించారు.