మండపేట: రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని వైయస్ఆర్‌సీపీ మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. మండపేటలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఆస్తులు, వేగుళ్ల ఆస్తుల వివరాలను రుజువులతో సహా వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. పెద్ద కాల్వ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేత, టిడ్కో ఇళ్లలో నెలకొన్న సమస్యలు, రుణాల మాఫీ హామీ అమలుపై తోట త్రిమూర్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగించి టిడ్కో ఇళ్లకు తరలించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లలో వేలాది మందికి ఇళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాకుండా, ప్రస్తుతం ఎంతమంది అక్కడ నివసిస్తున్నారో చూపించాలని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు. పేదల ఇళ్లను అర్ధరాత్రి వేళ పోలీసుల సహాయంతో తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పేదలకు నిలువ నీడ లేకుండా చేయడం సరికాదన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని, తనకు ఉన్న ఆస్తుల వివరాలు రుజువు చేస్తే వాటిని వేగుళ్ల జోగేశ్వరరావు పేరున రాసేందుకు సిద్ధంగా ఉన్నానని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు మానుకుని, మండపేట అభివృద్ధి, పేదల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. పెద్ద కాల్వ నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు టిడ్కో ఇళ్ల సమస్యలను పరిష్కరించి, రుణాల మాఫీ హామీని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై వైయస్ఆర్‌సీపీ నిరంతరం అండగా నిలుస్తుందని తెలిపారు.