పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో పల్నాడు రైతాంగం సాగు, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. గతంలో శంకుస్థాపన చేసిన గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టును పక్కన పెట్టడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని గతంలో చెప్పిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడటం లేదని బొల్లా ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరసరావుపేటకు వచ్చిన సమయంలోనైనా పల్నాడు సాగునీటి సమస్యను ఆమె దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు. సుమారు రూ.6 వేల కోట్లతో గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పక్కన పెట్టి పోలవరం–బనకచర్ల పేరుతో కొత్త నినాదాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించామని, ప్రస్తుతం రైతులకు బీమా పరిహారం అందడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటలు పండక, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను రుణాల వసూళ్ల పేరుతో వేధించడం సరికాదని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి, గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు వరికపూడిశెల ప్రాజెక్టు పనులను తక్షణమే ముందుకు తీసుకెళ్లి పల్నాడు రైతులకు సాగు, తాగునీరు అందించాలని బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు.